ఇదే మాట చెబుతా : రాజధాని ముంపు ప్రాంతం – మంత్రి బోత్స

  • Published By: madhu ,Published On : August 25, 2019 / 07:29 AM IST
ఇదే మాట చెబుతా : రాజధాని ముంపు ప్రాంతం – మంత్రి బోత్స

రాజధాని అంశంపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నారు మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని నిర్మాణ విషయంలో ఇటీవలే మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై 2019, ఆగస్టు 25వ తేదీ ఆదివారం విజయనగరం జిల్లాలో మంత్రి బోత్స మీడియాతో మాట్లాడారు. 

రాజధాని ఏ ఒక్కరిదో..ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిందో కాదు..ఐదు కోట్ల ప్రజలదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీని కేంద్రం నియమించిందని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణ ప్రాంత విషయంలో సామాజిక అవసరాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు, అన్నింటినీ గుర్తించి..క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూతన ప్రభుత్వానికి నివేదిక అప్పచెప్పాలని సూచించింది. కానీ 2014లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం…కమిటీ నివేదికను పట్టించుకోలేదన్నారు. ఏపీ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 

రాజధానికి వరద ముంపు ఉందని తేల్చిచెప్పారు. 8 లక్షల క్యూసెక్కుల నీటికే రాజధాని ప్రాంతం ముంపునకు గురయ్యిందని..అదే 11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు మంత్రి బోత్స. ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారం అవుతోందని..ఇలాంటివన్నీ ప్రభుత్వం ఆలోచిస్తోందన్న మంత్రి బోత్స..రాజధాని నిర్మాణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. 

ఏపీ మాజీ స్పీకర్ కోడెలపై వస్తున్న అంశంపై స్పందించారు. చట్టం తనపని తాను చేసిందన్నారు. ఎవరిపై కక్ష పెట్టుకోదని..చట్టానికి లోబడి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని..దళారీల మాటలు నమ్మి ఉద్యోగాల కోసం మోసపోవద్దని మంత్రి బోత్స సూచించారు.

Read More :అటు వెళ్లొద్దు: నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకూ ట్రాఫిక్