మళ్లీ TDPదే అధికారం : కౌంటింగ్‌‌లో అలర్ట్‌గా ఉండండి

  • Publish Date - April 25, 2019 / 05:28 AM IST

ఎన్నికలు పూర్తయ్యాయి..అయినా ప్రత్యర్థుల కుట్రలు మాత్రం ఎండ్ కాలేదు..కౌంటింగ్ పూర్తయ్యేదాక అందరూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కార్యకర్తలు, నేతలకు సూచించారు. ఫలితాలు వెల్లడి అయ్యేదాక వైసీపీ, బీజేపీ కుట్రలు చేస్తాయన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థుల ఓట్లలో తేడాలున్నట్లు వారికి తెలియచేశారు. మోడీ దుర్మార్గాల మధ్య ఈ ఎన్నికలు ప్రజల సహనానికి పరీక్షగా అభివర్ణించారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి కారణం మోడీయే అంటూ ఆరోపించారు.

తెలుగు తమ్ముళ్లతో ఏప్రిల్ 25వ తేదీ గురువారం బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు..ఎన్నికల ఫలితాల్లో ఎలా నడుచుకోవాలో దిశా..నిర్దేశం చేశారు. అధికారంలోకి రావడానికి జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని ఆరోపించారు. కులాల వారీగా రాష్ట్రంలో ఓటింగ్ చీలిపోరాదని..కులాలు..మతాల పేరిట చీలికలు సమాజానికి చేటు చేస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లింల అత్యధిక ఆదరణ టీడీపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు.  

మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తాను జరిపిన ఎన్నికల ప్రచార సభలు సక్సెస్ అయ్యాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తానన్నారు. ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్థమౌతుందని, ఈసీ రూపంలో అధికారుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు బాబు. ఈసీకి గుణపాఠం ఎలా చెప్పాలో ఆ విధంగా చెబుతామన్నారు. ఇంటర్ పరీక్షలపై సీఎం కేసీఆర్ సమీక్ష పెడితే ఎవరూ నోరు మెదపలేదని..అయితే ఏపీలో సమీక్షలు నిర్వహిస్తే మాత్రం ప్రశ్నిస్తారని తెలిపారు. కనీసం అక్కడ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదన్నారు. మే 1 నుండి పార్లమెంట్ వారీగా పార్టీ సమీక్ష సమావేశాలుంటాయని బాబు వెల్లడించారు.