ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈవీఎంలు వాడటం లేదు

  • Publish Date - April 14, 2019 / 07:26 AM IST

ఢిల్లీ : ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వాడటం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటప్పుడు మన దేశంలో ఎందుకు వాడాలి అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అనే రీతిలో చంద్రబాబు మరోసారి మాట్లాడారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన చంద్రబాబు.. ఢిల్లీలో ఈసీతో పోరాటం చేస్తున్నారు.

ఆఖరికి జర్మనీ లాంటి దేశాలు కూడా పేపర్ బ్యాలెట్ వాడుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. బాగా అభివృద్ది దేశాల్లో చాలా వరకు ఈవీఎంలను పక్కన పెట్టాయని చంద్రబాబు అన్నారు. ఈవీఎం వల్ల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయన్న చంద్రబాబు.. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కి వెళ్లిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఇబ్బంది తప్పలేదన్నారు. కొన్ని చోట్ల పోలైన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఇదెలా సాధ్యమైందో అర్థం కావడం లేదని చంద్రబాబు వాపోయారు. మన దేశంలో ఈవీఎంల ఆడిట్ కు అవకాశం లేదని చంద్రబాబు చెప్పారు.

ఏపీ భవన్ లో అంబేద్కర్ విగ్రహానిక చంద్రబాబు నివాళి అర్పించారు. రాజ్యాంగబద్ద సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని వాపోయారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రధానిగా ఉండేందుకు ఎన్ని తప్పులైనా చేస్తామనే దిశగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కొందరు లూటీ చేసి భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. రూ.2వేల నోటు వల్ల రాజకీయాలు నీచంగా మారాయన్నారు. ఎన్నికల కోసం డబ్బు ఖర్చు పెట్టి ఆ తర్వాత దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తీరు, ఈవీఎంలపై వస్తున్న అనుమానాలు, వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు, సుప్రీం కోర్టులో రివ్యూపిటిషన్‌ దాఖలు, ఈసీ పనితీరు తదితర అంశాలపై జాతీయ పార్టీ నేతలతో చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు, ఎన్నికలు మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు. ఏపీలో పోలింగ్ రోజున ఈవీఎంలు మొరాయించిన అంశంపై ఆయన ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. 18 పేజీలతో కూడిన లేఖ ఇచ్చారు.