ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మోడీ మాటల ప్రధానియే తప్ప చేతల ప్రధాని కాదని విమర్శించారు. ఏపీ విభజనపై మోడీ రోజుకో మాట మారుస్తున్నారని… నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ మాట్లాడారని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి రావడానికి మోడీనే కారణమని ఆరోపించారు. ఈమేరకు ఆయన ఆదివారం (మే5, 2019)న అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
తల లేని మొండెం లాగా విశాఖ రైల్వే జోన్ ఇచ్చారని తెలిపారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పారు. విభజన చట్టంలోని 18 అంశాల్లో ఏ ఒక్క అంశాన్ని పరిష్కారం చేయలేదన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయమంటే ఎదురుదాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఎగతాలి చేసి మాట్లాడుతున్నారని తెలిపారు. అమరావతికి ఇబ్బంది కల్గించారని…పోలవరం డీపీఆర్ క్లియర్ చేయలేదన్నారు.
మోడీ మాయ మాటలను ఖండిస్తున్నామని చెప్పారు. మోడీ చౌక బారు ప్రసంగాలు చేశారని అన్నారు. తనవి అవకాశాద రాజకీయాలు కావని.. మోడీవే అవకాశవాద రాజకీయాలు అన్నారు. ఏపీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ను వైసీపీకి అందుబాటులో ఉంచారని ఆరోపించారు. గుజరాత్ తప్ప వేరే రాష్ట్రం మోడీకి కనబడటం లేదన్నారు.
నాలుగు బడ్జెట్ లలో ఏపీకి మొండి చేయి చూపించారని తెలిపారు. అమరావతికి మట్టి, నీళ్లిచ్చారని వెల్లడించారు. కేంద్రం ఏపీకి నిధులు ఇవ్వకపోతే జీఎస్టీ ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. ఎంత అణగదొక్కినా అభివృద్ధిలో గుజరాత్ కంటే ముందే ఉంటామని అన్నారు.