ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఇసుక సరఫరాపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం ఇసుక వారోత్సవాలను నిర్వహిద్దామని నిర్ణయించారు. వారం రోజులపాటు ఇసుక మీదే పనిచేసి.. ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో టీడీపీ పాలనలో వ్యవస్థను పూర్తి అవినీతి మయం చేసేశారు. ప్రస్తుతం దీన్ని పూర్తిగా రిపేర్ చేస్తున్నాం. ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాం. ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలం. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు సమృధ్దిగా కురిసి వరదలు వచ్చాయి..ఇది రైతాంగానికి ఎంతో మేలు చేస్తుంది. గతంలో తవ్విన ఇసుక స్థానంలో ఇప్పుడు వరదల వల్ల కొత్త ఇసుక వచ్చి చేరింది. కానీ, విపక్షం రాబందుల మాదిరిగా ప్రభుత్వంపై రాళ్లు వేస్తూ..అనవసర ఆరోపణలు చేస్తోందని జగన్ అన్నారు. వరదలు రావటం వల్ల ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నాం. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని తెలుస్తోంది కనుక ఇసుక వారోత్సవం పేరుతో నిర్మాణ రంగానికి ఇసుక అందిద్దాం. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాం. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దాం. వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగవుతాయి’ అని సీఎం అన్నారు.
రాష్ట్రం నుంచి ఇసుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి కాపలా ఉండాలి. డీజీపీ స్వయంగా దీనిని పర్యవేక్షించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు పని దొరకడం లేదన్నది వస్తున్న వార్తలు సరికాదు. గతంలో అవినీతి, మాఫియాతో ఇసుకను తరలించేవారు. ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది. దీనివల్ల మరింతగా కార్మికులకు పనులు లభిస్తాయి. పట్టాభూములున్న రీచ్‌ల్లో తప్ప మిగతా చోట్ల మాన్యవల్‌గా ఇసుక తీయాలని చెప్పాం. వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో 70 చోట్ల రీచ్‌లను గుర్తించారు’ అని సీఎం చెప్పారు.
ఇసుక కావాల్సిన వారు ‘గ్రామ సచివాలయాల్లో ఎవరైనా చలానా కట్టి 20 కి.మీ వరకు ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలించవచ్చు. పనులు కావాల్సిన కార్మికులు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక రీచ్‌ల్లో పనులు చేసుకోవచ్చు. వరదలు తగ్గగానే రీచ్‌ల్లో ఎవరు పనులు అడిగినా ఇవ్వాలి. ప్రభుత్వం అధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది కాబట్టి…. పేదలకు మరింత మంచే జరుగుతుంది. ప్రతిపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తోంది. కౌలు రైతులకు సాయం చేశాం.. వారికి మరిన్ని పనులు కల్పించే అవకాశం ఉంటుంది. వరదల కారణంగా 267 రీచ్‌లకు 69 చోట్ల మాత్రమే ఇసుక తీస్తున్నారు. నవంబర్ వరకు వరదలు తగ్గుతాయి. ఇసుక అందుబాటులోకి వస్తుంది’అని ముఖ్యమంత్రి వివరించారు.