ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి సీఎం జగన్ షాక్? రసవత్తరంగా జమ్మలమడుగు రాజకీయం

తమకు సముచిత స్థానం దక్కడంలేదని అసంతృప్తి చెందుతున్నారు. ప్రత్యామ్నాయంగా వీరంతా టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

MLA Mule Sudheer Reddy

MLA Mule Sudheer Reddy : కడప.. ముఖ్యమంత్రి జగన్ మోన్‌రెడ్డి సొంత జిల్లా. ఈ జిల్లాలో పులివెందులతోపాటు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం కూడా ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకం. వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి సీఎం కుటుంబం నుంచే ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో జమ్మలమడుగు రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జమ్మలమడుగు ఎమ్మెల్యే పై జగన్ సీరియస్‌..!
అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను మారుస్తూ వైసీపీలో హైఅలర్ట్‌ ప్రకటించిన సీఎం జగన్‌.. తన సొంత జిల్లా కడపలో కూడా కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు డేంజర్‌ సిగ్నల్స్‌ పంపుతున్నారు. ముఖ్యంగా తన కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన జమ్మలమడుగులో ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కొనసాగించే పరిస్థితి లేదన్న ప్రచారం.. కడప జిల్లా రాజకీయాల్లో హీట్‌పుట్టిస్తోంది.

Also Read : నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?

కొద్ది రోజుల క్రితం అనంతపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌.. కడప ఎయిర్‌పోర్టులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పనితీరుపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని సీఎం హెచ్చరించినట్లు వైసీపీ వర్గాల భోగట్టా.

దేవగుడి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే..
సీఎం వార్నింగ్‌తో జమ్మలమడుగు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున దేవగుడి భూపేష్ రెడ్డి పోటీచేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, వైసీపీలో ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. పైగా జమ్మలమడుగులో రాజకీయంగా పట్టున్న దేవగుడి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే వైఎస్ కుటుంబ సభ్యులు మాత్రమే పోటీ చేయాలని స్థానిక క్యాడర్‌ డిమాండ్‌ చేస్తోంది. గత ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలిలో సుధీర్‌రెడ్డి గెలిచినా.. ఈసారి మాత్రం ఆయనను తప్పించాల్సిందేనని నియోజకవర్గ స్థాయిలో డిమాండ్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గంతో ఎమ్మెల్యే వర్గానికి పొసగకపోవడంతో సీఎం జగన్‌ కూడా ఈ నియోజకవర్గంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?

ఎమ్మెల్యే తీరు పట్ల తీవ్ర అసంతృప్తిలో వైసీపీ కేడర్..
జమ్ములమడుగు నియోజకవర్గంలో పట్టున్న నేతల్లో ఒకరైన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూర్తిగా దూరం పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన మద్దతుదారుల్లో చాలా మంది వైసీపీలో తమకు సముచిత స్థానం దక్కడంలేదని అసంతృప్తి చెందుతున్నారు. ప్రత్యామ్నాయంగా వీరంతా టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సీఎం జగన్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నేతలను కూడా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేతో విభేదాలు ఎక్కువ కావడంతో ఆయన సమీప బంధువులు కూడా పార్టీని వీడుతున్నారు. ఇటీవల కాలంలో టీడీపీలో చేరిన గంగవరం శేఖర్ రెడ్డి.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి దగ్గర బంధువే.. కానీ, ఎమ్మెల్యే తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే కారణంగా ఆయన పార్టీ మారాల్సి వచ్చిందంటున్నారు వైసీసీ క్యాడర్‌.

ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సీటుపై వేటు వేసే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యే పనితీరుపై ఆరోపణలతోపాటు వర్గ విభేదాలను ఎమ్మెల్యేయే పెంచి పోషిస్తున్నారని సీఎం జగన్‌కు నివేదికలు అందినట్లు చెబుతున్నారు. దీంతో జమ్మలమడుగు కోసం ప్రత్యామ్నాయ నేతలను అన్వేషిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కూడా జగన్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు.