YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy : లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ వెను వెంటనే ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్ట్, 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ఆసక్తి పెంచుతోంది. అకస్మాత్తుగా సీఎం జగన్ హస్తిన యాత్ర వెనుకున్న ఉద్దేశం ఏంటి? రాజకీయ అంశాలు ఏవైనా ఉన్నాయా? లేక పరిపాలనాపరమైన పనుల మీదే కేంద్ర పెద్దలను కలుస్తున్నారా? అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో తెరచాటున ఏం జరుగుతోంది?
లండన్ పర్యటన నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన సీఎం జగన్ బుధవారం(సెప్టెంబర్ 13) ఢిల్లీకి వెళ్లనున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనలో సీఎం జగన్ కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారని అంటున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం వచ్చీరాగానే ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంపై రాజకీయంగా రకరకాల చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా సీఎం జగన్ లండన్ లో ఉండగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ మంటలు అలా కొనసాగుతూ ఉండగానే సీఎం జగన్ హస్తినకు వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది. సీఎం జగనే స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారు? కేంద్రం పెద్దలు పిలిచారా? అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావన, 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీతో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది బీజేపీ. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ వరకు గడువు ఉండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ఏమైనా చర్చ జరుగుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజకీయంగా తటస్థ వైఖరి అనుసరిస్తున్న సీఎం జగన్.. కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడు సహకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులకు వైసీపీ మద్దతు కోసం చర్చ జరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. అన్నింటికి మించి చంద్రబాబు అరెస్ట్ పై కేంద్ర పెద్దలు ఏమైనా ప్రశ్నిస్తారా? లేక సీఎం జగన్ ను సమర్థించేలా వ్యవహరిస్తారా? అన్నదానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
Also Read..Pawan Kalyan: పవన్ కల్యాణ్ కన్ఫూజన్‌లో ఉన్నారా?
లండన్ టూర్ తర్వాత ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ, వెంటనే ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టడం, ఆ తర్వాత జిల్లాల పర్యటనలు ఉండటంతో సీఎం జగన్ టూర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ పై కొన్ని జాతీయ పార్టీలు ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. ఇదే సమయంలో సీఎం జగన్ ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. జాతీయ పార్టీలకు తన ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో అర్థమయ్యేలా వివరించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని మరో ప్రచారం కూడా ఉంది.
అయితే, ఇవేవీ కారణాలు కాదని కొంతమంది అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగేందుకే సీఎం జగన్ ప్రధాని అపాయింట్ మెంట్ కోరారని అంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఏపీలో హాట్ టాపిక్ మారింది. ఈ టూర్ ల సీఎం జగన్ ఏం చెబుతారు? కేంద్ర పెద్దలు ఏమంటారో? అనేది ప్రతి ఒక్కరికి తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తోంది.