అలిగిన కేఈ : అసలు కారణమేంటో తెలుసా

  • Publish Date - February 1, 2019 / 01:15 AM IST

విజయవాడ : కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలిగినట్లు కనిపిస్తున్నారు. తన  చిరకాల ప్రత్యర్ధి  కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలనుకోవడం, అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కేఈ అసంతృప్తికి కారణమని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. కొద్ది రోజులుగా విరుద్ధ ప్రకటనలు చేస్తూ..  అధినేతను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని…తాజాగా కేఈ చేసిన వ్యాఖ్యలు.. అధినేతపై అసంతృప్తిని బయటపెట్టాయని వారు చెప్పుకుంటున్నారు.

అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో జనవరి 31వ తేదీ గురువారం టీటీడీ నిర్మిస్తున్న దేవాలయ భూకర్షణ కార్యక్రమం జరిగింది. ఆ  కార్యక్రమానికి టీటీడీ అధికారులు తనను ఆహ్వానించలేదని కేఈ చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రినైన తననే అధికారులు విస్మరించారన్నారు. ఆహ్వానం అందనందువల్లే తాను వెంకటపాలెం వెళ్లలేదని చెప్పారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు.. సంబంధింత మంత్రిని ఎందుకు ఆహ్వానించలేదో నివేదిక ఇవ్వాలని సీఎంవోను  ఆదేశించారు. సీఎంవో అధికారులు టీటీడీని వివరణ కోరగా.. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి రాజేంద్రుడితో  కేఈ కృష్ణమూర్తికి ఆహ్వానం పంపినట్లు తెలిపారు. 

కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుండడంపై.. కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి, బుట్టారేణుకతో చంద్రబాబు చర్చించారని, వారి సమ్మతితోనే కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి ఆహ్వానించినట్లు సీఎంవో నుంచి వార్తలొచ్చాయి. అయితే.. కోట్ల కుటుంబం చేరికకు సంబంధించి తనతో చంద్రబాబు ఏమీ మాట్లాడలేదని కేఈ కుండబద్దలు కొట్టారు. ఆ విషయం తన వద్ద ప్రస్తావిస్తే అభిప్రాయం చెపుతానన్నారు. అలాగే.. తన ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖలో నడుస్తున్న వ్యవహారాలపై కేఈ అసంతృప్తిని వెళ్లగక్కారు.  శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నియామకం ఫైలు సీఎంకు పంపి మూడు నెలలైనా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. పెద్ద ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయకుంటే అనేక సమస్యలు వస్తాయని, రెవెన్యూ శాఖ కంటే దేవాదాయ శాఖే క్లిష్టంగా మారిందని కేఈ అన్నారు. అయితే ఈ అక్కసు అంతా దేవాదాయ శాఖ మీదో లేక టీటీడీ మీదో కాదని, పార్టీ అధినేత చంద్రబాబుపై అసంతృప్తేనని టీడీపీలో చర్చ జరుగుతోంది.