గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి ఎవరు? ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు..!

ఈ పరిస్థితుల్లో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Guntur West Tdp Ticket Issue

Guntur West TDP Candidate : గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎంపికలో టీడీపీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురవుతోంది. అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగడంతో టీడీపీపైనా ఒత్తిడి పెరిగింది… వైసీపీ వ్యూహానికి దీటుగా టీడీపీ కూడా బీసీలకు చాన్స్‌ ఇస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ కోటను బద్దలు కొట్టాలని వైసీపీ ప్లాన్‌..
తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీకి చెక్‌ చెప్పేలా వ్యూహం సిద్ధం చేసింది వైసీపీ. బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజినికి చాన్స్‌ ఇచ్చింది అధికార పార్టీ. అంతేకాకుండా మంత్రి రజని భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ ప్లస్‌ కాపు ఈక్వేషన్‌లో టీడీపీ కోటను బద్దలు కొట్టాలని ప్లాన్‌ చేసింది వైసీపీ.

టీడీపీ టికెట్ రేసులో ఆ ముగ్గురు..
గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఈ సీటును ఎలాగైనా గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా, టీడీపీలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ను అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌తో పాటు తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌, గల్లా మాధవి ఆశిస్తున్నారు. వీరిలో డేగల ప్రభాకర్‌ కాపు సామాజికవర్గానికి చెందిన నేత కాగా, తాళ్ల వెంకటేశ్‌ బీసీ నేత. ఐతే బీసీ వర్గానికే చెందిన గల్లా మాధవి బీసీ ప్లస్‌ కమ్మ కోణంలో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కాపులకే ఇవ్వాలని డిమాండ్..
బీసీలు, కాపులు ఎక్కువగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి కాపులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉండటం వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పశ్చిమ సీటు కోసం కాపు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 45 వేల కాపు సామాజికవర్గం ఓట్లు ఉండటంతో.. ఆ వర్గానికి టికెట్‌ కేటాయిస్తే సునాయాసంగా గెలవొచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ కూడా కాపు కార్డు ప్రయోగిస్తున్న విషయాన్ని గమనించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు టీడీపీ కాపు నేతలు.

కాపులను ఆకట్టుకోవడం ఎలా?
కాపుల ఓట్లు టీడీపీకి మళ్లకుండా ఉండేందుకు గుంటూరు జిల్లాలో పకడ్బందీ ప్రణాళిక వేసింది వైసీపీ. గుంటూరు ఎంపీ టికెట్‌తో పాటు పొన్నూరు, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్లు కాపు సామాజికవర్గానికి కేటాయించింది. ఇక గుంటూరు మేయర్‌ పదవిని కూడా కాపులకే ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీకి చెక్‌ చెప్పాలంటే అర్బన్‌ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌కు టికెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై కాపు నేతలు ఒత్తిడి చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు