ఏపీలో అమలవుతున్న పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఇప్పటికే పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఎపి టిడ్కో (APTIDCO) లో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు టెండర్లు ఖరారు చేస్తూ, ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా వ్యవహరించిన తీరుకు ఫుల్ స్టాప్ పెట్టే చర్యల్లో భాగంగా అప్పటికే ప్రారంభం కాని పనులను రద్దు చేయడం, కొనసాగుతున్న పనులను పునః సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. టిడ్కో ఆధ్వర్వంలోని వివిధ గృహ నిర్మాణ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల పనుల పురోగతి, స్థితిగతులు సమీక్షించిన అనంతరం, ఈ పనులకు కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలన్న ఉత్తర్వులపై మంత్రి బొత్స సత్యనారాయయణ సంతకం చేశారు.
రివర్స్ టెండరింగ్ లో అనుసరించాల్సిన విధి విధానాలను బొత్స ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గి ఖజానాపై భారం తగ్గడంతో పాటు, ఆయా పథకాల్లోని లబ్ధిదారులపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా టిడ్కో రివర్స్ టెండర్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.