ఇదిగో నిజం…ఇంక ఆపండి… మీ అబద్ధాలు, దుష్ప్రచారాలు  

  • Publish Date - August 23, 2019 / 11:08 AM IST

అమరావతి : తిరుమల బస్సు టికెట్ల పై అన్యమత ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై ముద్రించిన అన్యమత ప్రచారం వెనుక ఉన్న అసలు నిజం బట్ట బయలయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వం పధకాల ప్రచారంలో భాగంగా వాటిపై  ప్రకటనలు ముద్రించే టెండర్ ఖరారైంది. చంద్రబాబు పేరుతో పథకాలను ప్రచారం చేసేందుకు  2018 లోనే కాంట్రాక్టు కుదిరింది. మొత్తం 60 వేల టిమ్ పేపర్లపై మైనారిటీ సంక్షేమ శాఖ ప్రకటనలు వేయాలని.. మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్ కు కాంట్రాక్టు ఇచ్చారు.

ఆ టెండర్ తోనే తిరుమల బస్ టిక్కెట్లపై మైనారిటీ శాఖ అధికారులు  ఈ ప్రకటనలు ముద్రించినట్లు తెలిసింది.  కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినా టిమ్ పేపర్లపై చంద్రబాబు పేరుతోనే పథకాల ప్రచారానికి సహకరించిన అధికారుల పాత్రపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇందుకు బాధ్యులైన అధికారులు, సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది. 

తిరుమల బస్ టికెట్స్ వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు.  తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. టికెట్లపై అన్యమత ప్రచారం గత  టీడీపీ ప్రభుత్వ  తప్పిదం అని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. నెల్లూరులో ఉండే టిమ్ టికెట్ రోలు తిరుపతి కి ఎలా వచ్చిందో విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు.