టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్న బాబు, పెర్ని నాని విమర్శలు చేశారు. చంద్రబాబు సినిమాల్లో బ్రహ్మానందంలా తయారయ్యారని మంత్రి కన్నబాబు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్న బాబు, పెర్ని నాని విమర్శలు చేశారు. చంద్రబాబు సినిమాల్లో బ్రహ్మానందంలా తయారయ్యారని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులను అయోమయానికి గురిచేయడం సరికాదన్నారు. హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జనవరి 17న మరోసారి భేటీ అవుతామని మంత్రి పేర్ని నాని తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు రైతులు అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని 29 గ్రామాల రైతులను కోరుకుంటున్నామని చెప్పారు.
రాజధాని అమరావతి ప్రాంతాల ఆందోళనల్లో రైతులతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారని చెప్పారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ విషయాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అమరావతి ప్రాంతం కాని మహిళలను తీసుకొచ్చి ఆందోళనలకు వాడుకుంటున్నారని చెప్పారు. వారికి తప్పితే మిగిలిన వారందరికీ ఒక క్లారిటీ ఉందన్నారు. 29 గ్రామాల్లో నిజమైన రైతులకు తాము చెప్పేది అర్థం అయిందని.. వారు తప్పకుండా చేస్తారని తెలిపారు. రాజకీయాలు చేయడం కోసం ప్రీ ప్లాన్డ్ గా కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని తెలిపారు.
అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చించారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టిగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేసింది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ లతో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఇప్పటికే పలు సూచనలు చేసింది. రెండుసార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ మరోసారి సమావేశం అయింది.
గత సమావేశాల్లో పరిపాలనే కాదు అభివృద్ధి వీకేంద్రకరణ ఎలా జరగాలన్న అంశంపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది. బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలే కాకుండా అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ భావించింది. దానికి సంబంధించి ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలు పెట్టింది. ఉద్యోగుల తరలింపుపై పలు సూచనలు చేసింది.
ఇప్పటివరకు జరిగిన రెండు సమావేశాల్లో రాజధాని రైతుల మీదే ఎక్కువగా ఫోకస్ చేసినా ఈ సారి మాత్రం ఉద్యోగులు, వారి సాదకబాదకాలపై దృష్టి పెట్టారు. రైతులు, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకొని, వాటిపై చర్చించిన అనంతరం జనవరి 17వ తేదీన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అంశంపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది. ఆ మరుసటి రోజు జనవరి 18 వ తేదీ జరుగనున్న కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై చర్చ జరింగింది. రైతులు, ఉద్యోగులతోపాటు భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది.