TDP Leader Palle Raghunatha Reddy
Palle Raghunatha Reddy : 30 ఏళ్ల రాజకీయ నేపథ్యం.. జిల్లా రాజకీయాలను శాసించిన చరిత్ర.. పార్టీలో తిరుగులేని పట్టు.. మంత్రిగా, చీఫ్ విప్‌గా పనిచేసిన అనుభవం.. ఇన్ని ఘనతలు ఉన్నా ఆ నేతకు ఇప్పుడు పార్టీలో ఎదురుగాలి వీస్తోంది. ఆ సీనియర్ నేతను తప్పించాల్సిందేనంటూ సొంత నియోజవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలు నానా యాగీ చేస్తున్నారు. ఇన్నాళ్లు తన వెన్నంటే తిరిగిన వారు.. ఎర్రజెండా ఎగరేయడంతో ఆ సీనియర్ నేతకు టెన్షన్ పట్టుకుంది. అనుచరుల దెబ్బతో టికెట్ వస్తుందా? రాదా? అన్నదే ప్రధాన అంశంగా మారిపోయింది.
సీనియర్లకు చుక్కలు చూపిస్తున్నారు తమ్ముళ్లు..
ఎన్నికల వేళ టీడీపీలో టికెట్ ఫైట్ రక్తి కట్టిస్తోంది. ఇన్నాళ్లు పార్టీలో తిరుగే లేదన్నట్లు వ్యవహరించిన నేతలకు కూడా చుక్కలు చూపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పదవులు అనుభవించిన నేతలు పక్కకు తప్పుకోవాలంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో బడా బడా లీడర్లంటూ చెప్పుకున్న వారు సైతం కాళ్లబేరానికి వస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే తయారైందట.. ఒకప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పల్లె రఘునాథరెడ్డికి ఈ సారి టికెట్ వస్తుందో? రాదో? అన్నంత కష్టం ఎదురవుతోందట.
Also Read : ఈ నియోజకవర్గం టీడీపీకి అచ్చిరావడం లేదా? ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది?
పల్లెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం..
పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న రఘునాథరెడ్డిని పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడం రఘునాథరెడ్డికి సవాల్‌గా మారింది. పుట్టపర్తి టీడీపీ అంటే పల్లె రఘునాథ్ రెడ్డి అన్నట్లు చెప్పుకున్న పరిస్థితి ఈ ఐదేళ్లలో మారిపోయింది. ఆర్థికంగా పల్లె రఘునాథ్ రెడ్డి వంటి నేత టీడీపీలో లేకపోయినప్పటికీ.. యువతకు అవకాశాలివ్వాలనే ఉద్దేశంతో పార్టీ కూడా ప్రత్యామ్నాయం వెతుకుతున్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. దీంతో మూడు దశాబ్దాలు పార్టీలో ఓ వెలుగు వెలిగిన పల్లె రఘునాథ్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సివస్తోందని అంటున్నారు.
ఈ ఒక్కసారికి సహకరించాలని విన్నపం..
ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిన తర్వాత.. పల్లె రాజకీయం మొత్తం తలకిందులైందని చెబుతున్నారు. పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న, బుక్కపట్నం మండలానికి చెందిన కీలక నేత పెద్దరాసు సుబ్రహ్మణ్యం, ఓబులదేవర చెరువు మాజీ ఎంపీపీ ఇస్మాయిల్‌తో పాటు మరికొందరు నేతలు గత కొన్నేళ్లుగా పల్లె రఘునాథ్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ ఒక్కసారికి సహకరించండి.. వచ్చే ఎన్నికల నుంచి నేనే స్వచ్ఛందంగా తప్పుకుంటానంటూ అసంతృప్తులను బజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకొస్తే పదవుల పంపకాల్లో పెద్దపీట వేస్తానని.. చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసు చేసుకోవాలని అసమ్మతులను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు రఘునాథరెడ్డి.
Also Read : దెబ్బకు రెండు పిట్టలు.. జగన్ మాస్టర్ స్ట్రోక్.. సింగిల్ లిస్ట్‌తో మూడు నియోజకవర్గాల సమస్యకు చెక్..!
టికెట్ వస్తుందా? రాదా?
దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న రఘునాథరెడ్డి ఎన్నడూ లేనట్లు ప్రస్తుతం టికెట్ వస్తుందో రాదో అన్న సందిగ్ధతను ఎదుర్కోవడం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. యువతకు అవకాశాలు పేరిట అధిష్టానం మాజీ మంత్రిని తప్పిస్తుందా? తప్పిస్తే ఎవరికి అవకాశం ఇస్తుందన్నదే హాట్‌టాపిక్‌గా మారింది. అసంతృప్తులు, అసమ్మతులను దారికి తీసుకుని వస్తే.. రఘునాథరెడ్డికి లైన్‌క్లియర్ అయినట్లేనా? లేక అధిష్టానం మదిలో మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? అన్నది కొద్దిరోజుల్లో తేలిపోనుంది.