పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ : జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

  • Publish Date - January 30, 2020 / 12:47 PM IST

జనసేనాని పవన్ కళ్యాణ్ కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ నిలకడలేని విధి విధానాల కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు లక్ష్మీనారాయణ.

లక్ష్మీనారాయణ నిర్ణయం జనసేన శ్రేణుల్లోనే కాదు.. ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. లక్ష్మీనారాయణ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజాసేవ కోసం తాను నటనకు పూర్తిగా స్వస్తి చెబుతానని గతంలో అనేకసార్లు పవన్ కళ్యాణ్ చెప్పారని… కానీ ఆయన మళ్లీ నటించాలని నిర్ణయించుకోవడం సరికాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్‌లో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. 

ఈ కారణంగానే తాను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్టు లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ కొంత కాలంగా పార్టీ తీరు, పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. జనసేనకు గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చాయి. చివరికి అదే జరిగింది. 

ఏపీలో ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే పవన్, లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు వచ్చినట్టు వార్తలొచ్చాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. కాగా, ఇటీవల బీజేపీతో జనసేన పొత్తు సహా పలు కీలక అంశాలపై పార్టీ తనను సంప్రదించకపోవడంపై లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పి ఉంటారని విశ్లేషిస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చేందుకు 2018 మార్చిలో లక్ష్మీనారాయణ సీబీఐ నుంచి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఏపీలో  విస్తృతంగా పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదట ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతకు ముందు ఏదైనా పార్టీ నుంచి ఆహ్వానం వస్తే చేరాలని ఆయన ఎదురు చూశారు. ఆ సమయంలో బీజేపీ, జనసేన లక్ష్మీనారాయణను ఆహ్వానించాయి. ఈలోపు ఆయన  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. దాంతో ఆయన టీడీపీలో చేరిక ఖాయం అనుకున్నారంతా. 

ఈలోపు జేపీ స్థాపించిన లోక్ సత్తాపార్టీ భాధ్యతలు తీసుకుని నడిపిస్తారనే ప్రచారం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సమయంలో.. ఆయన వివిధ రాజకీయ పార్టీల నేతల్ని కూడా  కలిశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణదీక్ష చేస్తున్న సీఎం రమేష్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో సమావేశమయ్యారు. రైతుల కోసం ఏదైనా చేయాలన్న ఆశయంతో ఆయన రాష్ట్రమంతా పర్యటించారు. 

రాజకీయాల్లోకి వస్తే వ్యవసాయ మంత్రిని అవుతానని ఆ పర్యటనల్లో ఆయన చెప్పేవారు. చివరికి జనసేన లో చేరి  విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పవన్ వెంట జనసేనలోనే ఉన్నారు.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలని తీసుకున్ననిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. 

Also Read : కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారా ?

ట్రెండింగ్ వార్తలు