రాజధాని మారిస్తే వైసీపీ పతనం ప్రారంభమైనట్టే : చంద్రబాబు

  • Publish Date - January 8, 2020 / 02:52 PM IST

5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటే నేను రాజధాని మార్పుకు అంగీకరిస్తానని..అలా కాకుండా మొండిగా రాజధానిని మార్చాలని మారిస్తే మీ పతనం ఇక్కడి నుంచేప్రారంభం అవుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని విషయం అనేది  ఏ ఒక్క జిల్లా, సామాజిక వర్గానికో ప్రాంతానికో చెందిన  సమస్య కాదని ఇది 5 కోట్ల మంది సమస్య అని చంద్రబాబు చెప్పారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పోలీసులతో ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారని ఆయన అన్నారు.  రాజధాని రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ విసిరారు.

అమరావతి రాజధానిపై శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే  మొదటి స్ధానంలోఉన్న విజయవాడ-గుంటూరు మధ్య అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టామని మాజీ సీఎం  చంద్రబాబు నాయుడు చెప్పారు.  రాజధాని అమరావతి నిర్మాణానికి 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కేంద్రం అనుమతి తీసుకునే అమరావతి నిర్మాణం చేపడితే  వైసీపీ నాయకులు ఏమీ అభివృధ్ది చేయలేదని అంటున్నారని అన్నారు. విజయవాడలో అమరావతి  పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పడిందని..రాష్ట్రం కోసం తన వంతు బాధ్యతగా జేఏసీ ముందుకొచ్చిందని ఆయన అన్నారు.

రాజధానినిర్మాణానికి ఒక్క పిలుపుతో రైతులు 33వేల ఎకరాల భూములు ఇచ్చారు. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు..నిధులు ఇచ్చారని గుర్తు చేసారు.  ఎన్నికల ముందు వైసీపీ రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తుందని చెప్పిన ఆ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

రైతులు త్యాగాలను చూసి కేంద్ర ఆర్ధిక మంత్రి రైతుల కోసం క్యాపిటల్  గెయిన్స్ కూడా ఇచ్చారని అన్నారు. పోలీసు కేసులకు భయపడి ప్రజలు బయటకు రావటంలేదని…. లేకపోతే  ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  3రాజధానులఅంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల సమయంలో కర్నూలు, విశాఖలను ఏ రకంగా అభివృధ్ది చేస్తామో  వివరించామని…. రాజధాని  మార్పు విషయం వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదని ఆయన ఆరోపించారు.  తన తండ్రి చనిపోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో ప్రజలు చనిపోతే ఓదార్పు యాత్ర చేసిన జగన్…. రాజధాని రైతులు 9 మంది మరణిస్తే ఆయన పార్టీకి చెందిన ఎవ్వరూ పరామర్శించలేదని ఆరోపించారు.