Kavitha Suspended: కారు నుంచి కవితను దించేయడానికి అసలు కారణం అదేనా? కేసీఆర్ మాట వినుంటే ఫ్యూచర్ మరోలా ఉండేదా?

Kavitha Suspended: కారు నుంచి కవితను దించేయడానికి అసలు కారణం అదేనా? కేసీఆర్ మాట వినుంటే ఫ్యూచర్ మరోలా ఉండేదా?

Updated On : September 4, 2025 / 11:32 PM IST

Kavitha Suspended: పార్టీ ఆమెకు అన్నీ ఇచ్చింది. ఓ సారి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది. మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడినా ఎమ్మెల్సీని చేసి గుర్తించింది. పదవీకాలం ముగిశాక కూడా మరోసారి ఎమ్మెల్సీని చేసింది. ఆ తర్వాత లిక్కర్ కేసు ఆమె మెడకు చుట్టుకుని పార్టీకి ఇబ్బందికరంగా మారినా భరించారు. లిక్కర్ స్కాం తర్వాత కామ్‌గా ఉండాలని గులాబీ బాస్ చెప్పినా ఆమె పట్టించుకోలేదని తెలుస్తోంది. సైలెంట్‌గా ఉండటం నచ్చలేదో.. లేక పొలిటికల్‌గా ఇంకా పైస్థాయికి ఎదగాలన్న ఆకాంక్షో కానీ.. జుకేగా నహీ అంటున్నారు కవిత. కారు నుంచి కవితను దించేయడానికి కారణం అదేనా? ఆ ఇష్యూలో అధినేత మాట వింటే కవిత ఫ్యూచర్ మరోలా ఉండేదా?

మూడు నెలల సస్పెన్స్ వీడింది. మూడ్రోజులు అయిపోయింది కూడా. అంతా ఊహించినట్టే జరిగింది. ఎట్టకేలకు కవితను కారు దించేశారు. పెద్ద నిర్ణయమే అయినా..సొంత కూతురును దూరం పెట్టడం ఇబ్బందిగా అనిపించినా..గులాబీ బాస్ బిగ్ డెసిషన్ తీసుకోక తప్పలేదు. కవితపై సస్పెన్షన్ వేటు వేసి..గులాబీ వనం నుంచి దూరం పెట్టేశారు.

మొన్న జగదీష్ రెడ్డిపై కామెంట్స్, లేటెస్ట్ గా హరీశ్, సంతోష్ పై అలిగేషన్స్..కేటీఆర్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ కవితపై యాక్షన్ కు దారితీసిన పరిస్థితులు అని చెప్పినా..అసలు కారణం వేరే ఉందట. కవితను పార్టీ నుంచి పంపించేయడానికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్ కేసేనని బీఆర్ఎస్ ఇన్సైడ్ టాక్. లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు బయటికి వచ్చిన్పపుడు కేసీఆర్ నమ్మలేకపోయారని గులాబీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

కూతురి అరెస్ట్ తో.. తీవ్రంగా కలత చెందిన కేసీఆర్..!

తన కూతురు పేరు లిక్కర్ స్కామ్ కేసులో వినిపించడంతో కేసీఆర్ చాలా హర్ట్ అయ్యారని..తీవ్ర మనోవేదనకు గురయ్యారని అంటున్నారు. తన కూతురు, అందులోనూ ఆడపిల్ల ఇలా లిక్కర్ కేసులో ఇరుక్కోవడమేంటని కేసీఆర్ చాలా ఫీల్ అవడంతో పాటు తీవ్రంగా బాధపడ్డారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆమె అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ తీవ్రంగా కలత చెందినట్లుగా కూడా నేతలు చర్చించుకుంటున్నారు.

కవిత తీహార్ జైలులో ఉన్నప్పుడు కూడా గులాబీ బాస్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని..జైలులో కవితతో ములాఖత్ అయ్యేందుకు కూడా కేసీఆర్ సాహసం చేయలేకపోయారట. కూతుర్ని జైలులో అలా చూసి తట్టుకోలేకే కవిత జైలులో ఉన్నప్పుడు కేసీఆర్ కలవలేదని అంటున్నారు. ఆమెపై ఉన్న అభియోగాలు, కేసులు అన్నీ పరిశీలించి..న్యాయ నిపుణులతో చర్చించి..బెయిల్ వచ్చాకే రిలీఫ్ అయ్యారు గులాబీ బాస్.

తన రాజకీయ జీవితంలో, తెలంగాణ ఉద్యమంలో, పదేళ్ల అధికారంలో ఎక్కడా ఏ మచ్చ లేకుండా నిఖార్సైన మనిషిగా బతికిన కేసీఆర్..తన కన్న బిడ్డ కవిత లిక్కర్ కేసులో ఇరుక్కోవడంపై తీవ్రంగా బాధపడ్డారట. కవిత లిక్కర్ స్కామ్ కేసు బీఆర్ఎస్ పార్టీకి, వ్యక్తిగతం గా తనకూ బ్యాడ్ నేమ్ వచ్చిందని భావించారట. ప్రజల్లో బీఆర్ఎస్ పై నెగెటివిటీ క్రియేట్ కావడానికి లిక్కర్ కేసు కూడా ఓ కారణమని గ్రహించిన గులాబీ బాస్..కవిత జైలు నుంచి వచ్చాక..ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారట.

కవితను పలుమార్లు హెచ్చరించిన కేసీఆర్..!

కొన్నాళ్ల పాటు పొలిటికల్ సైలెంట్ గా ఉండాలని కవితకు చెప్పారట కేసీఆర్. పరిస్థితులు అంతా సెట్ అయ్యాక రాజకీయంగా మళ్లీ యాక్టీవ్ కావొచ్చులే అని డైరెక్షన్స్ ఇచ్చారట. అయితే తండ్రి కేసీఆర్ చెప్పిన మాటలను కొన్ని రోజులు పాటించి మౌనంగా ఉన్న కవిత..మళ్లీ తన పొలిటికల్ యాక్టివిటీని మొదలుపెట్టి హడావుడి చేయడం స్టార్ట్ చేశారట. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ లైన్ కు భిన్నంగా, జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరిస్తుండటంతో కవితను కేసీఆర్ పలుసార్లు హెచ్చరించినట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం.

దీంతో ఆమె సైలెంట్ గా ఉండలేక.. పార్టీపై, పార్టీలోని నేతలపైనా విమర్శలు చేసి సస్పెన్షన్ దాకా తెచ్చుకున్నారని తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి హరీశ్, సంతోష్ పై అవినీతి ఆరోపణలు చేసిన కవిత పరోక్షంగా కేసీఆర్ ను కూడా ఇరకాటంలో పడేసిన పరిస్థితి. దీంతో ఇంకా ఆలస్యం చేస్తే కుటుంబానికి, పార్టీకి నష్టం తప్పదని భావించిన అధినేత..కవితపై సస్పెన్షన్ వేటు వేసినట్లు చెబుతున్నారు.

పార్టీలో నుంచి కవితను పంపించేయడానికి ఐదారు ప్రధాన కారణాలున్నా..ఆమె మాత్రం హరీష్ రావు, సంతోష్ రావుపై బాణాలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఇప్పుడు తనకు వచ్చినట్లే, రేపు కేసీఆర్, కేటీఆర్ కు ముప్పు పొంచి ఉందని చెప్పడంలో అంతర్యమేంటన్నది హాట్ టాపిక్ గా మారింది. అసలు కవిత హరీష్ రావు పేరు ఎందుకు చెప్పారన్నది అర్థం కావడం లేదంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు.

అయితే తిరిగి కేసీఆర్, కేటీఆర్ కు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే కవిత హరీశ్, సంతోష్ పై అస్త్రాలను వాడారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తండ్రిపై, సోదరుడు కేటీఆర్ పై ఏమాత్రం మాట్లాడకపోవడం ద్వారా కొంత సింపతీ తెచ్చుకోవచ్చనే వ్యూహం కూడా ఉందనే టాక్ నడుస్తోంది. కేసీఆర్ కు ఎవరో తన మీద తప్పుడు ఫిర్యాదులు చేశారని కవిత అనడం కూడా చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ చెప్పుడు మాటలు విని ఇన్ ఫ్లుయన్స్ అయ్యేంత బలహీనుడు కాదన్నది బీఆర్ఎస్ నేతలు, గులాబీ బాస్ సన్నిహితుల వాదన. ఇలా ఎన్నో రీజన్స్, మరెన్నో ఈక్వేషన్స్ మధ్య కవిత సస్పెన్షన్, ఆమె రియాక్షన్‌పై డిఫరెంట్ టాక్ వినిపిస్తోంది.

Also Read: మారుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ ఈక్వేషన్స్.. ఉపఎన్నిక బరిలో కవిత? వ్యూహం అదేనా?