Jair Bolsonaro Arrest: ఆ కేసులో.. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో అరెస్ట్..
ఈ కేసు విచారణ సమయం నుంచే బోల్సొనారో గృహ నిర్బంధంలో ఉన్నారు. న్యాయస్థానం విధించిన శిక్షపై అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
Jair Bolsonaro Arrest: బ్రెజిల్ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో అరెస్ట్ అయ్యారు. ఫెడరల్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. తిరుగుబాటు కుట్ర చేశారన్న అభియోగాలపై ఇప్పటికే ఆయనకు 27 ఏళ్ల శిక్ష పడింది. కొన్ని రోజుల్లో జైలుకి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో విదేశాలకు పారిపోకుండా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఫెడరల్ పోలీసులు వెల్లడించారు.
2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్న బోల్సొనారో.. 2022 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఫలితాలను అంగీకరించేందుకు ఆయన నిరాకరించారు. అదే సమయంలో ఆయన మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పదవిలో కొనసాగడం కోసం బోల్సొనారో తిరుగుబాటు కుట్ర చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మాజీ అధ్యక్షుడికి 27ఏళ్ల శిక్ష విధిస్తూ సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది.
ఈ కేసు విచారణ సమయం నుంచే బోల్సొనారో గృహ నిర్బంధంలో ఉన్నారు. న్యాయస్థానం విధించిన శిక్షపై అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. కాగా, జైలుకి వెళ్తే బోల్సొనారో ప్రాణాలకు ముప్పు ఉందని.. ఈ కారణంగా ఆయనను గృహ నిర్బంధంలోనే ఉంచాలని ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించినా ఎలాంటి రిలీఫ్ దక్కలేదు.
గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు బోల్సొనారో సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించారు. 2018లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన కత్తిపోటుకు గురయ్యారు. డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. 2022లో ఎన్నికల ప్రచారంలో తన పదవిని దుర్వినియోగం చేసినందుకు బ్రెజిల్ ఎన్నికల కోర్టు బోల్సోనారోను దోషిగా తేల్చింది. 2030 వరకు ఆయన పదవికి పోటీ చేయకుండా నిషేధించింది.
