Cm Revanth Reddy: సీఎం రేవంత్, ఆ మంత్రి మధ్య గ్యాప్ ఉందా? ఆయనకు ఇన్విటేషన్ ఎందుకు లేదు? కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది..
ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఆ మంత్రికి హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఒక కమిటీలో ఆయన ఉంటారు.

Cm Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎందరో సీనియర్ లీడర్లు ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సీనియర్ మోస్ట్. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చాక పీసీసీ చీఫ్‌గా 2018 ఎన్నికలను ఫేస్ చేశారు. ఆ మాట కొస్తే సీఎం రేసులో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓ తాగునీటి పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఉత్తమ్ ప్రస్తావనే లేకపోవడం చర్చకు దారితీస్తోంది. ప్రొటోకాల్ పాటించకపోవడం ఒక ఎత్తు అయితే..ప్రకటనల్లో కూడా ఆయన ఫోటో కనిపించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.
హైదరాబాద్‌కు భవిష్యత్తు తాగునీటి అవసరాలతో పాటు మూసీ నదీ పునర్జీవం కోసం జలమండలి ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్లకు తరలిచండంతో పాటు మూసీనదీ పునర్జీవం కోసం వాడాలని నిర్ణయించింది.
మంత్రి ఉత్తమ్‌కు ఇన్విటేషన్ లేకపోవడంపై చర్చ..
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 16 టీఎంసీలు, మిగతా నాలుగు టీఎంసీలను మూసీలో పారించడానికి ఓ ప్రాజెక్టుకు ప్లాన్ చేసి.. సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇన్విటేషన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బృహత్తర కార్యక్రమం అంటూ ప్రభుత్వం తరఫున న్యూస్ పేపర్లలో పెద్ద ఎత్తున యాడ్స్ వేశారు. పేపర్లలో ఫస్ట్ ఫేజ్ యాడ్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫోటోను ప్రచురించకపోవడం చర్చకు దారి తీస్తోంది.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్, జిల్లా మంత్రి దామోదర, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను మాత్రమే ఆహ్వానించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలోనే మల్లన్నసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉంటాయి. వాటి నుంచే హైదరాబాద్‌కు నీటిని తరలిస్తామంటూ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. అలాంటి ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కు ఎందుకు ఇన్విటేషన్ లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్‌కు హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఒక కమిటీలో ఉత్తమ్ ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో కూడిన కమిటీనే కీలక డెసిషన్స్ తీసుకుంటుంది.
ఉత్తమ్ మాటకు హైకమాండ్ ప్రయారిటీ..!
ఈ కమిటీలో మంత్రి ఉత్తమ్ చెప్పే మాటకు హైకమాండ్ ప్రయారిటీ ఇస్తుందనే టాక్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ వల్ల.. కొన్నిసార్లు సీఎం రేవంత్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయనే చర్చ జరిగింది. మంత్రివర్గ విస్తరణతో పాటు..పార్టీ కీలక కమిటీల్లో సీఎం మాట చెల్లుబాటు కాలేదనే టాక్ కూడా ఉంది. ఇప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంశం పెండింగ్‌లోనే ఉంది.
అంతేకాదు ఇక్కడ పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పాలనపై ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్‌కు నివేదికలను పంపిస్తున్నారట మంత్రి ఉత్తమ్. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మధ్య గ్యాప్ ఉందని అటు ప్రభుత్వంలో..ఇటు కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. ఇంతలోనే జలమండలి ఆధ్వర్యంలో జరిగిన పోగ్రామ్‌లో మంత్రి ఉత్తమ్‌కు ఇన్విటేషన్ లేకపోవడంతో ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే ఉత్తమ్‌కు ఇన్విటేషన్ లేకపోవడం అధికారుల తప్పిదమా? మరేదైనా రీజన్ ఉందో కానీ..సీఎం వర్సెస్ ఉత్తమ్ అనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..? కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఏం చెప్పారంటే