చిత్తూరు: జిల్లా రాజకీయాల్లో అతనో సెంటరాఫ్ అట్రాక్షన్. ఒకవైపు వెన్నంటి ఉండే అనుచరులు.. మరోవైపు వెంటాడే శత్రువులు. ముఖ్యమంత్రులను సైతం లెక్క చేయని మనస్తత్వం.
చిత్తూరు: జిల్లా రాజకీయాల్లో అతనో సెంటరాఫ్ అట్రాక్షన్. ఒకవైపు వెన్నంటి ఉండే అనుచరులు.. మరోవైపు వెంటాడే శత్రువులు. ముఖ్యమంత్రులను సైతం లెక్క చేయని మనస్తత్వం. టీడీపీ గాలిలోనూ తట్టుకొని గెలిచిన నాయకుడు. రాజకీయంగా కొన్ని తప్పుటడుగులు వేయడంతో.. ఇప్పుడాయన రాజకీయ పరిస్థితి సందిగ్దంలో పడింది. ఆయనే సీకే జయచంద్రారెడ్డి ఆలియాస్ సీకే బాబు.
సీకే బాబు అంటే చిత్తూరు టౌన్‌లో.. తెలియని వారుండరు. అభిమానులు ముద్దుగా చిత్తూరు టైగర్ అని పిలుచుకుంటారు. సీకే బాబు అంటే చిత్తూరు నియోజకవర్గంలో సంచలనం. మాస్ లీడర్‌గా ప్రజల్లో గుర్తింపు ఉంది. 4 సార్లు చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది…. సత్తా చాటుకున్నారు. టీడీపీ హవా కొనసాగిన సమయంలోనూ…జిల్లాలో గెలిచి ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సీకే బాబుకు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న బలమేంటో. అయితే రాజకీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో…ఆయన భవితవ్యం సందిగ్దంలో పడింది.
సీకే బాబు ఓ సాధారణ కార్మిక నేతగా కెరీర్ ప్రారంభించారు. తొలుత కౌన్సిలర్‌గా గెలిచి….మున్సిపల్ వైస్ ఛైర్మన్ అయ్యారు. క్రమంగా వ్యాపార, కార్మిక, వర్తక సంఘాల్లో పట్టు సాధించారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1994, 99 ఎన్నికల్లోనూ…కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చిత్తూరు అసెంబ్లీలో హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా 1994 ఎన్నికలు గురించి చెప్పుకోవాలి. జిల్లాలోని 15 స్థానాల్లో 14 చోట్ల టీడీపీ జెండా ఎగురవేస్తే….చిత్తూరు టౌన్‌లో మాత్రం సీకే బాబు విజయం సాధించారు.
సీకే బాబుపై ఓ మర్డర్ కేసు ఉండటంతో….2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి…ఓటమి పాలయ్యారు. వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్‌లో కొనసాగిన సీకే బాబు….2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా నాలుగో సారి విజయం సాధించారు. వైఎస్ మృతితో….సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో ఇమడలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన చిత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో…సీకే బాబు భార్య లావణ్య మున్సిపల్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేకపోయారు. దీంతో వైసీపీలో సీకే బాబు ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయారు.
తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు విజయం కోసం సీకే గట్టిగా ప్రయత్నించారు. కాని.. టీడీపీ విజయం సాధించింది. దీంతో వైసీపీలో సీకే బాబు ఒంటరవుతూ వచ్చారు. చివరికి ఆ పార్టీ దూరంగా పెట్టింది. దీని వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని సీకే అనుమానం. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సీకే బాబు….2017లో బీజేపీలో చేరి మరో తప్పుటడుగు వేశారు. నాడు పొత్తుల్లో భాగంగా 2019లో చిత్తూరు అసెంబ్లీ టికెట్ వస్తుందని భావించారు. అయితే ఎన్డీఎ నుంచి టీడీపీ బయటకు రావడంతో….పొలిటికల్ కెరీర్ ఇప్పుడు పూర్తిగా సందిగ్దంలో పడింది. అయినప్పటికీ సమయం దొరికినప్పుడల్లా…చిత్తూరులో తిరుగుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ…పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజల అభిమానంతో ఇంతవాడినయ్యానని….వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని సీకే బాబు కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరులో ఒకప్పుడు రాజకీయాలను శాసించిన సీకే బాబుకు 2019 ఎన్నికల్లో ఏ పార్టీ టిక్కెట్ ఇస్తుంది అన్నది సందిగ్ధంగా మారింది. పోటీ చేసినా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.