గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లిన జగన్, ఇంకా షాక్‌లోనే ఉన్నారు

  • Publish Date - July 28, 2020 / 03:18 PM IST

అమాత్య పదవి కోసం ఎన్నోఆశలు పెట్టుకున్నారు… దానిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.. తీరా ఊహకందని నిర్ణయాన్ని అధినేత జగన్ తీసుకోవటంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నిన్నటి దాకా మంత్రిపదవి రేసులో ఉన్నామన్న ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలు కాస్త ఇప్పుడు డీలాపడిపోయారు. మరోవైపు తమ నాయకుడికి మంత్రిపదవి ఖాయమని సంతోషపడిన అనుచరగణం సైతం ప్రస్తుతం నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకీ మంత్రి వర్గ విస్తరణ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల ఆశలను అడియాశలు చేసిందా…మరి మంత్రి పదవి కోసం ఆశపడ్డ నేతల ప్రస్తుత పరిస్ధితి ఏంటి?

జగన్ నిర్ణయంతో కంగు:
గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో… ఆయన స్థానంలో మంత్రి పదవిని గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి ఇచ్చి రీప్లేస్ చేస్తారన్న ప్రచారం బాగా జరిగింది. ఆ పదవిని దక్కించుకోవటం కోసం జిల్లాకు చెందిన వైసిపి శాసన సభ్యులు ముమ్మర ప్రయత్నాలు కూడా చేశారు. అధినేత జగన్ మాత్రం అనూహ్యంగా జిల్లాతో సబంధం లేని వారికి మంత్రిపదవి కేటాయించటంతో ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మొన్నటిదాకా ఇద్దరు అమాత్యులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించగా… ఇప్పుడు జిల్లా నుంచి సుచరిత మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం జిల్లాలోని వైసిపి ఎమ్మెల్యేలను అయోమయానికి గురిచేస్తోంది.

తీవ్ర నిరాశలో అంబటి, పిన్నెల్లి:
పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు మంత్రి పదవిపై బాగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ఇప్పుడున్న వైసిపి ఎమ్మెల్యేలందరిలో సీనియర్‌గా, వైయస్ కుటుంబానికి బాగా దగ్గరగా.. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపున్న అంబటికి అవకాశం దక్కటం ఖాయమని అంతా భావించారు. జిల్లాలో పార్టీ పటిష్టత కోసం టిడిపిలో ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ లాంటి నేతలను సైతం పార్టీలో చేరేలా పావులు కదిపారు. అంబటి సైతం తనకు జగన్ మంత్రి పదవి ఇచ్చి మంచి గుర్తింపు ఇవ్వటం ఖాయమని సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారు. మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైతం తనకు ప్రాతినిధ్యం దక్కుతుందని ఆశించారు. సుచరిత గుంటూరు నుంచి మంత్రిగా ఉండగా… పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తనకు చోటు ఖాయమని ఊహించారు. కానీ, చివరి క్షణంలో అధినేత తీసుకున్న నిర్ణయంతో కలవరపాటుకు గురయ్యారు.

ఇంకా షాక్‌లోనే విడదల రజినీ:
ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని సైతం మంత్రివర్గ విస్తరణ చివరి క్షణం వరకు తనకు పదవి ఖాయమన్న సంబరాల్లో మునిగితేలారు. బిసి సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి రాజ్యసభకు ఎన్నిక కావటంతో ఖాళీ అయిన అదే సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తి చేస్తారని… తనకు మంత్రిపదవి వచ్చేసినట్లేనని అనుచరులకు సంకేతాలు ఇచ్చేశారు. అటు ఆమె అనుచరులు సైతం పేట నుంచి గుంటూరు వరకు పోటీలు పడి సంబరాలు చేశారు. వీళ్ల హడావుడి చూసి జిల్లాలోని ఇతర వైసిపి ఎమ్మెల్యేలంతా ఇది నిజమేమో కాబోలు అనుకున్నారు. అయితే అనూహ్యంగా జగన్ తీసుకున్న నిర్ణయంతో విడదల రజినీ సైతం షాకయ్యారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న కమ్మ సామాజికవర్గం నేతలు:
ఇక అదే చికలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పేరు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారని తెగ వినిపించింది. మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్… మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారన్న వార్తలు షికార్లు చేశాయి. రాజశేఖర్ సైతం పార్టీ హైకమాండ్ నుండి సంకేతాలు ఉన్నట్లు తన అనుచరులకు చెప్పుకొచ్చారు. కానీ, మర్రి రాజశేఖర్‌కు చివరికి నిరాశే మిగలింది. మరోవైపు కమ్మ సామాజికవర్గానికి చెందిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ సైతం రేసులో ఉన్నామని చెప్పుకొచ్చారు. మంత్రి పదవిపై వీరిద్దరు పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా… కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాల్సి వస్తే తమలో ఒకరికి వస్తుందని ఊహించారు. అయితే జగన్ వారి ఆశలకు అందని విధంగా నిర్ణయం తీసుకోవటంతో ఖంగుతిన్నారు.

పదవి ఆశించి భంగపడ్డ సీనియర్:
ఇక పార్టీలో సీనియర్ గా ఉండి ఏకంగా పార్టీ మ్యానిఫెస్టోను రూపకల్పన చేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైతం పదవి ఆశించి భంగపడ్డారు. వయస్సు రీత్యా తనను కాదంటే… తన అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు మంత్రిపదవి ఇప్పించుకోవాలని ప్రయత్నించారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ… రీసెంట్‌గా తన సోదరుడు అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ దక్కటంతో తనకు పదవి రాదన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను ఓడించటంతో పాటు రాజధాని అమరావతిలో టీడీపీ ఎత్తుగడలను చిత్తు చేయటంలో బలమైన నేతగా గుర్తింపు ఉండటంతో… ఆయన కొంచెం ఆశలు పెట్టుకున్నా… అది సాధ్యపడలేదు.

మరో రెండున్నరేళ్లు వెయిట్ చేయాల్సిందే:
ఇంత మంది ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లిన జగన్… అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా మొండిచేయి చూపించటం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపోయేలా చేసింది. తమ ఆంకాంక్షలన్నీ నెరవేరకపోవటంతో ఇప్పుడేం చేయాలో అర్ధంకాక అయోమయంలో పడ్డారు గుంటూరు జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు. కనుచూపు మేరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేకపోవటంతో… తమ కోర్కెలు, ఆశలు ఎలా తీర్చుకోవాలో అర్ధంకాక సతమతమౌతున్నారు. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్‌ ఉండటంతో… అప్పటిదాకా ఎదురు చూడాల్సిందేనంటూ ఉసూరుమంటున్నారు.