ఇకపై ఫాంహౌస్ నుంచి పరిపాలన సమీక్షలు, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

  • Publish Date - July 9, 2020 / 09:27 AM IST

సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారా? ప్రగతిభవన్ నుంచి కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కొన్నాళ్ల పాటు పరిపాలన సాగిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని తెలుస్తోంది. తెలంగాణలో పాలనాపరమైన నిర్ణయాలన్నీ ప్రగతిభవన్ నుంచే తీసుకునేవారు సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు కాస్త రూటు మార్చి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి వ్యవహారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రగతిభవన్‌లో ఉద్యోగులకు కరోనా, మరికొన్నాళ్లు ఫాంహౌస్‌లోనే:
జూన్ 28న పీవీ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్, ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచే మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిత్యం టచ్ లో ఉంటూ పాలనాపరమైన సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం తెప్పించుకుంటూ అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. ప్రగతి భవన్ లో కొందరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మరికొన్నాళ్లు సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఫాంహౌస్‌లో సమీక్షల నిర్వహణకు ఏర్పాట్లు:
ఈ పరిస్థితుల్లో ఫామ్ హౌస్ లో సమీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు ప్రగతి భవన్ నుంచి రివ్యూలు చేసినా ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమీక్షలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎర్రవల్లిలో ఏర్పాట్లు తుది దశకు చేరినట్టు టీఆర్ఎస్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొందరు అధికారులతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ వారంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన జరిపే అవకాశం సీఎంకు ఉందని, విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అటు ఫాంహౌస్ లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్, వ్యవసాయ క్షేత్రం పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.