గేట్ ఫైట్.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన సీఎం రేవంత్ కామెంట్స్

ఆపరేషన్ ఆకర్ష్‌ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గేట్లు తాము కూడా ఓపెన్ చేస్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓపెన్ చేసిన గేట్ల నుంచి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలని బీజేపీ కౌంటర్ ఇస్తుంది.

Gate Fight In Telangana Politics

CM Revanth Reddy : తెలంగాణ పాలిటిక్స్ లో గేట్ ఫైట్ నడుస్తోంది. ఒక్క గేట్ తెరిచాం అన్న సీఎం రేవంత్ కామెంట్ కు అటు గులాబీ దళం, ఇటు కాషాయ దళం నుంచి కౌంటర్ గట్టిగానే వినిపిస్తోంది. గేట్లు తెరవటం కాదు ఉన్న ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలంటోంది బీజేపీ. జంప్ అయిన ఒక ఎమ్మెల్యే మీద అప్పుడే అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది గులాబీ పార్టీ.

మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్..
ఎలక్షన్‌ షెడ్యూల్‌ రావడంతో ఎండలతో పోటీ పడి మరీ.. తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కాస్త చల్లారిన వాడీవేడీ విమర్శలు.. మళ్లీ ఊపందుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒకే కామెంట్‌తో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. గేట్లు తెరిచాం.. ఇక నుంచి అసలు రాజకీయం ఉంటుందన్న రేవంత్ కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. బీఆర్ఎస్ అలర్ట్ అయింది. బీజేపీ మాత్రం తగ్గేదేలేదంటోంది. తెలంగాణలో ఎప్పుడైనా డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమంటున్నారు కమలనాథులు.

ఇక, అసలు రాజకీయం చూపిస్తానన్న సీఎం రేవంత్..
కాంగ్రెస్‌లో చేరికలు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం కలవడానికి వస్తే సహకరిస్తామని.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమకు తాముగా పార్టీలో చేర్చుకోబోమని గతంలో చెప్పారు సీఎం రేవంత్. కేసీఆర్ చేసినట్లు ప్రతిపక్షం లేకుండా చేయమన్నారు. సీన్ కట్ చేస్తే 100 రోజుల పాలన పూర్తి అయింది.. గేట్లు ఓపెన్ చేశామంటూ కామెంట్ చేశారు రేవంత్. అసలు రాజకీయం ఇప్పటి నుంచి చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం పడిపోతుంటే మేము నిలబెట్టలేము..
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోదని, అలాగని ప్రభుత్వం పడిపోతుంటే తాము నిలబెట్టలేమన్నారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామంటున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ గేట్ల గుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమన్నారు లక్ష్మణ్.

ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలంటున్న బీఆర్ఎస్..
ప్రజా ప్రతినిధులు పార్టీ మారతుండటంతో అలర్ట్ అయింది బీఆర్ఎస్. కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. దానం నాగేందర్‌పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లోపు అనర్హత వేటు పడాల్సిందేనంటున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్‌ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గేట్లు తాము కూడా ఓపెన్ చేస్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓపెన్ చేసిన గేట్ల నుంచి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలని బీజేపీ కౌంటర్ ఇస్తుంది.

Also Read : భయమా? ఒత్తిళ్లా? బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడటానికి కారణాలు ఏంటి?

 

ట్రెండింగ్ వార్తలు