ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని కోదాడ నియోజకవర్గం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన ప్రాంతం. రెండు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ నియోజకవర్గం పేరుకు తెలంగాణ అయినా.. ఆంధ్ర ప్రాంత ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అందుకే తెలంగాణ అంతటా తెలంగాణవాదం బలంగా వీచినా.. ఇక్కడ మాత్రం పెద్దగా లేదంటారు. అందుకే మొన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా మాత్రమే ఇక్కడ రాజకీయాలు నడిచాయి. కానీ, గత డిసెంబర్‌లో అనూహ్యంగా చివరి నిమిషంలో టీఆర్ఎస్‌లో చేరి సీటు దక్కించుకొని బొల్లం మల్లయ్య యాదవ్ తొలిసారి గులాబీ జెండా ఎగురవేశారు. ఆయన శాసనసభలో అడుగుపెట్టింది కూడా తొలిసారే కావడం గమనార్హం.
తొలిసారి ఎగిరిన గులాబీ జెండా :
ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయవర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి వేనేపల్లి చందర్ రావు. 1985లో టీడీపీ తరఫున తొలిసారి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లో మరోసారి టీడీపీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో తుమ్మల నాగేశ్వరరావుతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన ద్వారా టీఆర్ఎస్‌లో చేరారు వేనేపల్లి.
వాస్తవానికి 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కోదాడ నుంచి టీఆర్ఎస్ తరఫున చందర్ రావు పోటీ చేస్తారని అందరూ భావించారు. టీడీపీ, కాంగ్రెస్ కూటమి తరఫున బొల్లం మల్లయ్యయాదవ్ పోటీలో ఉంటారనుకున్నారు. కానీ, అనూహ్యంగా కూటమి తరఫున మల్లయ్య యాదవ్‌కు అవకాశం రాకపోవడంతో.. చివరి నిమిషంలో టీఆర్ఎస్‌లో చేరి సీటు దక్కించుకుని విజయం సాధించారు. టీఆర్ఎస్ శ్రేణులు మొదటిసారి కోదాడ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగురవేశాయి.
ఇరువురి మధ్య ఆధిపత్య పోరు :
ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్య యాదవ్ విజయం సాధించిన తర్వాత చందర్ రావుతో కలిసి నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పాల్గొనేవారు. కానీ పలు సందర్భాల్లో బయటకు కనిపించకున్నా.. అంతర్గతంగా మల్లయ్య యాదవ్‌కు, చందర్ రావుకు నడుమ ఆధిపత్య పోరు నడుస్తోందని టాక్. రోజు రోజుకు అది తీవ్రమవుతోందని చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో చందర్ రావుకు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు మధ్య కొంత విభేదాలు వచ్చాయని, ఆ పార్టీలోని ముఖ్య నాయకులే అంటున్నారు. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో మరింత విభేదాలు ముదిరినట్లు టాక్.
స్థానిక ఎన్నికల నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ బాగా ఎక్కువైందని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మల్లయ్య యాదవ్ తనకు సహకరించడం లేదని వేనేపల్లి చందర్ రావు కొంత గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య తాము నలిగిపోతున్నామని ద్వితీయ శ్రేణీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇలానే కొనసాగితే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.