టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఎవరుంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరు నెలలలోపు ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ రామలింగారెడ్డి భార్యకు టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తే.. పార్టీ పెద్దలతో మాట్లాడి పోటీ లేకుండా చూస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించేశారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇలా అన్నారో లేదో.. అలా కాంగ్రెస్‌లోని మరో వర్గం కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చింది. గతంలో నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలను గుర్తు చేస్తోంది. నారాయణఖేడ్‌లో సిటింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే.. సంప్రదాయాలను పక్కన పెట్టి టీఆర్‌ఎస్ తన అభ్యర్థిలో బరిలో నిలిపిందని చెబుతున్నారు. దీంతో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
టీఆర్ఎస్ కంచుకోటపై కన్నేసిన పార్టీలు :
ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. పార్టీలో వ్యక్తిగత నిర్ణయం సాధ్యం కాదనీ, అందులోనూ నిత్యం టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్న తాము… ఏ విధంగా మద్దతిస్తామని, ఒకవేళ ఇచ్చినా కారణం ఏమని చెప్పాలంటున్నారు. దీంతో ఉప ఎన్నికలో పోరు మాత్రం తప్పేలా లేదు. ఏకగ్రీవానికి అవకాశం లేనట్టేనని తేలిపోయింది.
మరోపక్క, దుబ్బాక ఉప ఎన్నిక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని బీజేపీతో పాటు గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్ కంచుకోట అయిన దుబ్బాకలో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందనేది కమలనాథుల ఆలోచన అంటున్నారు.
బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ :
దుబ్బాక లాంటి చోట గెలవడం ద్వారా ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్‌లకు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించాలని ప్లాన్ చేస్తున్నారు కాషాయం నేతలు. నాలుగు పార్లమెంట్ సీట్లను గెలిచిన తర్వాత జోరు పెంచిన ఆ పార్టీ నేతలు దానిని కొనసాగించాలని భావిస్తున్నారు.
కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో ఎదుర్కోనబోతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట. సాధారణంగా బీజేపీలో అభ్యర్థి ఎంపికకు పెద్ద తతంగమే ఉంటుంది. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై ముగ్గురు పేర్లనే జాతీయ పార్టీకి పంపిస్తారు. అక్కడి పార్లమెంటరీ పార్టీలో చర్చ జరిగిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు.
ఇక్కడ భిన్నమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసి రామలింగారెడ్డిపై రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్‌కే ఈసారి కూడా టికెట్ ఇచ్చేందుకు ఫిక్సయ్యారట. దీంతో ఆయన అప్పుడు ప్రచారం ప్రారంభించేశారని చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ బలపడుతూ వస్తోంది.
రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు బీజేపీకి కలిసివస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్, మరోపక్క బీజేపీ కూడా పోటీకి సై అనడంతో ఇక ఏకగ్రీవానికి అవకాశం లేనట్టే. మరి టీఆర్ఎస్ ఈ విషయంలోఎలా వ్యవహరించబోతుందో ఎదురుచూడాలని అంటున్నారు.