Harish Rao: సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న కనిపించని శక్తి..! త్వరలో.. – హరీశ్ రావు సంచలనం

గత పదేళ్లు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఎక్కడా వివక్ష చూపలేదని హరీశ్ తెలిపారు. Harish Rao

Harish Rao: సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న కనిపించని శక్తి..! త్వరలో.. – హరీశ్ రావు సంచలనం

Harish Rao Representative Image (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 7:41 PM IST
  • ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూడాలి
  • ఒకరికి చుట్టం, మరొకరికి శత్రుత్వం ఉండకూడదు
  • సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు
  • సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ లో సంచలన పోస్ట్ పెట్టారు. సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని కోరారు. దీనిపై సమగ్ర విచారణ విచారణ జరపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు హరీశ్ రావు. ‘ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ పై నిప్పులు చెరిగారాయన.

సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం..

గత పదేళ్లు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఎక్కడా వివక్ష చూపలేదని హరీశ్ తెలిపారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందని, ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూడాలని సీఎం రేవంత్ కి హితవు పలికారు. ఒకరికి చుట్టం, మరొకరికి శత్రుత్వం ఉండకూడదన్నారు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట అంటూ సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు.

అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అని ముఖ్యమంత్రి రేవంత్ ని ప్రశ్నించారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారని విమర్శించారు.

పేరు మర్చిపోయినందుకు హీరోని జైలుకి పంపారు..

సినిమాటోగ్రఫీ మంత్రి పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు హరీశ్ రావు. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు.. ఇదెక్కడి విడ్డూరం అని వ్యాఖ్యానించారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా? వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా? అని నిలదీశారు.

Also Read: భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు.. రూ.547 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు.. సంచలన విషయాలు చెప్పిన ఖమ్మం పోలీసులు

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందన్నారు హరీశ్ రావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందన్నారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి ఏమో.. నాకు తెలీదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు అని హరీశ్ రావు విమర్శించారు.