KCR: ఆందోళన వద్దు.. అందరికీ టికెట్‌..! కేసీఆర్ ధీమా వెనుక రీజనేంటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షానికి పరిమితం అయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి అధికారం చేపట్టాలని ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

KCR: ఆందోళన వద్దు.. అందరికీ టికెట్‌..! కేసీఆర్ ధీమా వెనుక రీజనేంటి?

Kcr Representative Image (Image Credit To Original Source)

Updated On : January 13, 2026 / 8:44 PM IST
  • అసెంబ్లీ సీట్ల పెంపుపై మాజీ సీఎం కేసీఆర్ ధీమా.!?
  • టికెట్లు ఆశిస్తున్నవారికి భరోసా ఇస్తున్న గులాబీ బాస్..!
  • వచ్చే ఎన్నికల నాటికి సీట్ల పెంపు..?

 

KCR: 119 నియోజకవర్గాలు ఉన్నాయ్. ఇంకో 35 సీట్ల వరకు పెరగబోతున్నాయ్. ఆందోళన వద్దు.. అందరికీ సీట్లు వస్తాయ్. తనది భరోసా అంటూ ఆశావహులకు దిశానిర్దేశం చేస్తున్నారట గులాబీ బాస్ కేసీఆర్. తెలుగు స్టేట్స్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుందా? తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? కేసీఆర్ ధీమా వెనుక రీజనేంటి?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైముంది. అయినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలంతా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం ఆశావహులు తమ అధినేత కేసీఆర్‌ను కలిసి విన్నవించుకుంటున్నారట. ఈ సందర్భంగా గూలాబీ బాస్ వాళ్లందరికి టికెట్ల విషయంలో భరోసా ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు కేసీఆర్ ఓ నమ్మకం కలిగిస్తున్నారట. అదే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు. 2028 శాసనసభ ఎన్నికల నాటికి కచ్చితంగా డీలిమిటేషన్ జరిగి తీరుతుందని..అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారట.

119 నుంచి 154 కు పెంపు?

2028 అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడున్న సీట్ల ప్రాతిపదికన జరుగుతాయా? లేక పునర్విభజన చట్టంలో చెప్పినట్టు సీట్లు పెరుగుతాయా? అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. అదే గనుక జరిగితే తెలంగాణలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లకు బదులు 154 వరకు పెరగవచ్చన్న అంచనా ఉంది. దీంతో వివిధ రాజకీయ పార్టీల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులంతా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇలా అసెంబ్లీ సీట్ల పెంపుపై చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి టైమ్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతో ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షానికి పరిమితం అయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి అధికారం చేపట్టాలని ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ క్రమంలోనే తనను కలిసిన పార్టీ నేతలతో నియోజకవర్గాల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండని కూడా నేతలకు చెబుతున్నారట గులాబీ బాస్.

పలాన నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని సూచన..!

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీతో ఉందని, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా సీట్ల పెంపును డిక్లేర్ చేసి చట్టం కూడా తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే స్థాయి నేతలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రాని వాళ్లకు కేసీఆర్ భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ల కోసం తనను కలిసిన కొంత మంది నేతలకైతే ఏకంగా పలాన నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారట. దీంతో బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న చాలా మంది ఆశావహులు కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలపై అప్పుడే దృష్టి పెట్టారని అంటున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై మామూలుగా వేరేవరైనా మాట్లాడితే అంత సీరియస్‌గా ఉండేది కాదేమో కానీ..స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయని చెప్పడంతో బీఆర్ఎస్‌లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. కేంద్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్‌కు క్లారిటీ ఉండటం వల్లే అంత కచ్చితంగా చెబుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: చలాన్ పడిందా? టపీమని ఆటోమేటిగ్గా మీ అకౌంట్లో డబ్బులు కట్.. కొత్త ప్లాన్..