Addanki Dayakar Slams Vijay Sai Reddy
Addanki Dayakar : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను అద్దంకి దయాకర్ తీవ్రంగా ఖండించారు. విజయసాయిరెడ్డి విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై మీకు ఇంత అక్కసు ఎందుకు? అంటూ ఎదురుదాడికి దిగారు. రాజకీయ అజ్ఞాని అంటూ విజయసాయిరెడ్డిపై మాటల దాడి చేశారు.
”తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం ప్రతొక్కరికి పరిపాటిగా మారింది. మొన్న ఒకరు, నిన్న ఒకరు, నేడు ఒకరు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిలా కనిపించారు. ఆయన పెద్దల సభకు ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోదీ ప్రాపకం పొందాలి అనుకుంటే, మోదీ దగ్గర మార్కులు ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే, ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడటమా?
Also Read : బీజేపీకి మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ రాజీనామా.. కారణం ఏమిటంటే?
మీకున్న రాజకీయ తెలివి ఎంతో అర్థమవుతోంది. చార్టెడ్ అకౌంటెంట్ టు పొలిటికల్ లీడర్.. జగన్ కు సలహాదారుగా ఉన్నట్లు ఉండి.. పొలిటికల్ లీడర్ గా మారిన లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా. వైఎస్ షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు. అందుకని కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లబోసుకుంటున్నారేమో? రేపు రాజకీయంగా మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా కాంగ్రెస్ చెబుతుంది. కేసీఆర్ తో అంటకాగుతున్న మీరు.. మీ అక్కసు వెళ్లగక్కడం అనేది దేనికి సంకేతమో ఆలోచించండి” అని విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు అద్దంకి దయాకర్.
Also Read : లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న ఆశావహులు వీరే..