కరోనా కోరలు చాస్తోంది. ఈ రాకాసిని బయటకు పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించకుండా..చికిత్స అందిస్తున్న వైద్యులు ఇప్పుడు కీలకంగా మారారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా..వీరు చేస్తున్న శ్రమ, కృషిని ఎంతో మంది పొగడుతున్నారు. వైద్యుల్లారా మీకో వందనం అంటున్నారు.
అటు వైద్యులు, ఇటు సిబ్బంది ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. వీరంతా ఒకే లక్ష్యంతో ఉన్నారు. కరోనా వైరస్ ను ప్రారదోలాలని పనిచేస్తున్నారు. వైద్య బృందాలు అందిస్తున్న ఈ సేవలకు యావత్తు తెలంగాణ ప్రజలు సలాం కొడుతున్నారు.
వైద్యులను దేవుళ్లగా చూస్తుంటారు. తమకు వచ్చిన వ్యాధిని ప్రారదోలే డాక్టర్ ని మీరు దేవుళ్లు సార్ అంటుంటారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై పంజా విసురుతున్న ఈ మహమ్మారి బారిన 41 మంది పడ్డారు. వీరందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ యుద్ధంలో వేల సంఖ్యలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, నోడల్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, టెక్నీషీయన్లు, హౌస్ కీపింగ్ సర్జన్లు, అంబులెన్స్ సిబ్బంది..ఇలా మరికొంతమంది 24 గంటల పాటు పనిచేస్తున్నారు.
నగరంలోని ప్రధాన ఆసుపత్రియైన గాంధీలో దాదాపు 300 మంది షిప్టుల వారీ గా పనిచేస్తున్నారు. ఫీవర్, ఎర్రగడ్డ ఛాతి, ఉస్మానియాలో కూడా డాక్టర్లు పని చేస్తున్నారు.
వైరస్ సోకిన వ్యక్తిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. రోజు రెండు నుంచి మూడుసార్లు బీపీ, జ్వరం ఉందా ? లేదా ? అని చెక్ చేస్తున్నారు. టెస్టులకు శాంపిళ్లు సేకరిస్తున్నారు. ఒక్కో రోగి వద్ద సుమారు 10 నుంచి 20 మంది సిబ్బంది సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కరీంనగర్ లో కరోనా తీవ్రంగా ఉండడంతో 350 మందితో కూడిన బృందాలు…ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
* కరోనా – 19 వ్యాప్తి నియంత్రించేందుకు పని చేస్తున్న వైద్య సిబ్బంది : –
* ఆశా కార్యకర్తలు : 80 వేల మంది.
* వైద్య విభాగాల పరిధిలో పనిచేసే సిబ్బంది : 49 వేల 709
* వైద్యులు : 2 వేల 556.
* స్పెషాల్టీ వైద్యులు : 3 వేల 796.
* రాష్ట్రంలో పని చేస్తున్న వైద్యులు : 10 వేల 900.
* పారామెడికల్ సిబ్బంది : 11 వేల 886.