Bandi Sanjay slams Kcr
Bandi Sanjay slams Kcr: మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో వారి తండ్రి, సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మునుగోడు ఉప ఎన్నికలో గెలవబోమన్న భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని, దీంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్ళారని ఎద్దేవా చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారని కేసీఆర్ చేసిన విమర్శలపై బండి సంజయ్ స్పందించారు.
కరెంట్ మీటర్లు పెట్టుడం వెనుక పెద్ద కుట్రే ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ఇప్పుడు రైతుల మీద పడ్డారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తిప్పికొట్టారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు మోటార్లకు మీటర్లు గుర్తుకు వస్తాయని అన్నారు. బీజేపీ పేరు చెప్పి మీటర్లు పెడితే తాము సహించబోమని అన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందిన ఘటనలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని బాధ్యుడిని చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలంటూ ప్రజలు భయపడుతున్నారని ఆయన చెప్పారు. రికార్డు కోసం గంటకు 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని అన్నారు. బాధిత కుటుంబాలను కూడా ప్రభుత్వం తరఫున ఎవరూ పరామర్శించలేదని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, హెల్త్ డైరెక్టర్ పై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.