అబద్దాలు చెప్పించారు: అఖిల పక్షానికి సీపీఐ దూరం

  • Publish Date - January 30, 2019 / 10:30 AM IST

విజయవాడ: గవర్నర్ ప్రసంగంలో ఒక్క కొత్త అంశం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి రామకృష్ణ  ఆరోపించారు. ఆయన ఈరోజు విజుయవాడలో గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ “చంద్రబాబు ఆరు నెలలుగా పదేపదే చెబుతున్నదే గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు,రాష్ట్రంలో 327 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది, మరి 11శాతం వ్యవసాయ వృద్ది రేటు వుందని గవర్నర్ ప్రసంగంలో ఎలా చెబుతారు” అని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గడిచిన నాలుగు ఏళ్ళ కాలంలో 32  లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి తెచ్చామని అబద్దాలు చెప్పారని రామకృష్ణ చెపుతూ అనంతపురం జిల్లాలో ఎన్ని కుటుంబాలు వలస పోయాయో ప్రభుత్వం వద్ద లెక్కలు వున్నాయా అని అన్నారు. 

అవినీతి రహిత పాలన అని  చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని, అవినీతిలో చంద్రబాబు అందరినీ అధిగమించి పోయారని, టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి లో కూరుకుపోయారని ఆయన ఆరోపించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన విభజన హామీలపై తలపెట్టిన బంద్ కు అన్ని వర్గాలు సహకరించాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై సిఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఆయనకు గుర్తుకు వచ్చినప్పుడే అఖిలపక్షం అంటాడని రామకృష్ణ ఎద్దేవా చేశారు. అఖిలపక్ష సమావేశానికి సీపీఐ దూరంగా ఉంటుదని  రామకృష్ణ  తెలిపారు.