దగ్గుబాటి ఫ్యామిలీ..డబుల్ పాలిటిక్స్‌ 

ఒకే కుటుంబం.. రెండు రాజకీయ పార్టీల్లో కొనసాగడం సాధ్యమేనా ? రెండు పార్టీల్లో ఉంటే.. ప్రజలు నమ్ముతారా ?

  • Publish Date - February 6, 2019 / 07:27 AM IST

ఒకే కుటుంబం.. రెండు రాజకీయ పార్టీల్లో కొనసాగడం సాధ్యమేనా ? రెండు పార్టీల్లో ఉంటే.. ప్రజలు నమ్ముతారా ?

ప్రకాశం : ఒకే కుటుంబం.. రెండు రాజకీయ పార్టీల్లో కొనసాగడం సాధ్యమేనా ? రెండు పార్టీల్లో ఉంటే.. ప్రజలు నమ్ముతారా ? ఒకే కుటుంబం డబుల్ పాలిటిక్స్‌ నడపడం ఈజీనా ? తల్లి జాతీయ పార్టీలో….కొడుకు ప్రాంతీయ పార్టీలో కొనసాగితే…రాజకీయాల్లో విజయం సాధిస్తారా ? ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఇదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి..తెలుగు రాష్ట్రాల్లో  పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భార్యాభర్తలిద్దరూ ఎన్నో పదవులు పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరగవడంతో.. పురందేశ్వరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు తన వారుసుడు హితేశ్ చెంచురామ్‌ను.. రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. త్వరలో కుమారుడితో కలిసి వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 

హితేశ్ చెంచురామ్‌తో కలిసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన దగ్గుబాటి వెంకటేశ్వరావు.. పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. బీజేపీలో చిన్నమ్మగా ముద్రపడ్డ సుష్మా స్వరాజ్‌.. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆమె స్థానంలో పురందేశ్వరికి ప్రాధాన్యత కల్పించి.. సుష్మా స్వరాజ్‌ లేని లోటును పూడ్చాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, మేనిఫెస్టో కన్వీనర్‌గా పురందేశ్వరి ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. దీనికి తోడు మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో పాటు రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పంపుతామని పురందేశ్వరికి అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పార్టీ అంశాన్ని చిన్నమ్మ…ఉపసంహరించుకున్నట్లు సమాచారం.

పురందేశ్వరి వైసీపీలో చేరితే….ఆ పార్టీకి వచ్చే కిక్కే వేరని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ కూతురికి ఉండే చరిష్మాకు తోడు…బలమైన సామాజికవర్గం అండగా ఉండటంతో వైసీపీ కండువా కప్పుకుంటే మంచిదంటున్నారు. పురందేశ్వరి పార్టీలో చేరితే వచ్చే మైలేజ్‌తో పాటు చంద్రబాబు వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని వైసీపీ కేడర్ భావిస్తోంది. పురందేశ్వరి వైసీపీలో చేరితే.. కృష్ణా జిల్లాలో ఏదొక ఎంపీ సీటును ఎంపిక చేసుకోవాలని సూచించారు. అలా కుదరని పక్షంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా.. సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినా..  పురందేశ్వరి మాత్రం అంగీకరించనట్లు తెలుస్తోంది. 

రాజకీయంగా ఎదుగుతున్న  పురందేశ్వరి, ఆమె తనయుడు హితేశ్‌ చెరొక పార్టీలో ఉంటే తిప్పలు తప్పవు. పర్చూరులో బీజేపీ అభ్యర్థిని నిలబెడితే…పురందేశ్వరి ఎవరి తరపున ప్రచారం చేస్తారన్న దానిపై సందిగ్దత నెలకొంది. తల్లికొడుకులిద్దరూ వేర్వేరు పార్టీల్లో కొనసాగితే…ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండాలంటే…పురందేశ్వరి కూడా వైసీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయానికి పురందేశ్వరి వైసీపీలో చేరుతారా ? లేదంటే బీజేపీలో కొనసాగుతారో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.