విజయవాడ : పశ్చిమగోదావరి రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపు. దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు..వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఇంట్లో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. ఆయనతో పాటు తనయుడు హితేశ్ చెంచురాం…కూడా ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. దగ్గుబాటి..ఆయన తనయుడు హితేశ్‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కన్ఫామ్ అయిపోయిందని భేటీని బట్టి తెలుస్తోంది. వీరి భేటీ అరగంటకు పైగానే కొనసాగుతోంది. అమెరికా గ్రీన్ కార్డు విషయంలో సమస్య పరిష్కరించుకోవాలని జగన్ సూచించినట్లు టాక్.
సంక్రాంతి పండుగ పూట ఫ్లెక్సీ :
గత కొన్ని రోజులుగా దగ్గుబాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరుతారనే విపరీతమైన ప్రచారం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందర్నీ ఆకర్షించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై దగ్గుబాటి…ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ ఫొటోలున్నాయి. జనవరి 15వ తేదీన దగ్గుబాటి ఇంట్లో ఓ కీలక భేటీ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరితే జరిగే లాభ..నష్టాలపై చర్చించారు. పార్టీలో చేరిక విషయంపై ఎంపీ విజయసాయిరెడ్డి సంధానకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
హితేశ్‌కి పర్చూర్ టికెట్ :
జనవరి 27తేదీ తేదీ ఆదివారం మధ్యాహ్నం జగన్ నివాసానికి దగ్గుబాటి..ఆయన తనయుడు హితేశ్‌లు చేరుకున్నారు. వీరితో ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం టికెట్ హితేశ్‌కి ఇచ్చేందుకు జగన్ ఒకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరీల కుమారుడు హితేశ్‌కి పర్చూరు అసెంబ్లీ సీటుతో పాటు..పురంధేశ్వరీకి కోరుకున్న లోక్ సభ సీటు ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు టాక్. ఒకవేళ పురంధేశ్వరీ బీజేపీలోనే ఉంటే…ఒక ఇంట్లో రెండు పార్టీల నేతలుంటారన్నమాట. రాజకీయాలు మరి..
భర్త బాటలోనే :
ఇక ఇదిలా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురంధేశ్వరి బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే భర్త దగ్గుబాటి..కొడుకు హితేశ్‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే పురంధేశ్వరీ భవిష్యత్ ఏంటీ అనే చర్చ జరుగుతోంది. ఈమె కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా ? అనేది తెలియరావడం లేదు. పురంధేశ్వరీ బాపట్ల..విశాఖ లోక్ సభ నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. అంతేగాకుండా ఈమె యూపీఏ హాయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
2014 నుండి దగ్గుబాటి రాజకీయాలకు దూరం :
ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయానికి వస్తే…2004లో టీడీపీని వీడిన దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 2004-2009లో జరిగిన ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి గెలుపొందారు. 2014 ఎన్నికల నుండి దగ్గుబాటి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జగన్ సమక్షంలో దగ్గుబాటి..హితేశ్‌లు ఎప్పుడు కండువా కప్పుకుంటారో కొద్ది రోజుల్లో తెలియనుంది.