రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో రూల్ 71 కింద నోటీసు ఇవ్వడాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు.
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో రూల్ 71 కింద నోటీసు ఇవ్వడాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. శాసన మండలిలో సంఖ్యా బలంతో ఆ బిల్లును జాప్యం చేయడం మినహా అడ్డుకోలేమని తెలిసినా, టీడీపీ ఈ డ్రామాకు తెరతీయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను శాసనమండలిలో సంఖ్యా బలంతో అడ్డుకునే యత్నం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ నిపుణులు, సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.
భారత రాజ్యాంగంలోని 169వ అధికరణ ప్రకారం శాసనమండలిని ఏర్పాటు చేయాలన్నా, రద్దు చేయాలన్నా ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదిస్తే.. మండలి ఏర్పాటుకుగానీ, రద్దుకుగానీ ఆమోదముద్ర పడినట్లు లెక్క. శాసనసభ ఆమోదించిన బిల్లులపై మరింత అర్థవంతమైన చర్చలు జరిపి, వాటికి మెరుగులు దిద్ది.. జనరంజకంగా తీర్చి దిద్దడం శాసనమండలి ప్రధానోద్దేశమని భారత రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. కానీ, శాసన ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడానికే శాసనమండలిని కొన్ని రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయని, అందుకే దాన్ని ఉండుకంగా, ఆరవ వేలుగా రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాల్లో విశ్లేషించారు. ఇప్పుడు శాసనమండలిలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ నిపుణుల విశ్లేషణకు అతికినట్లు సరిపోతుంది.
రూల్ 71 అంటే ఏమిటి
శాసనమండలిలో అధికారపక్షం విధానంపై ప్రతిపక్షం తన అభ్యంతరం లేదా అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ రూల్–71 కింద చైర్మన్‌కు నోటీసు ఇవ్వొచ్చు. ఈ నోటీసు అందిన వారం రోజుల్లోగా శాసనమండలిలో చర్చ చేపట్టాలి. ఈ రూల్ కింద ఇచ్చిన నోటీసుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో ఆయా పక్షాల బలాబలాలను అనుసరించి బిల్లు ఆమోదం పొందడం/పొందక పోవడం ఉంటుంది. అయితే ఈ రూల్ కింద చర్చ చేపట్టే అంశం, బిల్లులోని అంశం ఒక్కటే అయితే సభలో ప్రవేశపెట్టకుండా తిరస్కరించడానికి వీల్లేదు. రూల్ 71కు, బిల్లులపై చర్చకు సంబంధం ఉండదు. ఆ బిల్లులను మళ్లీ సభలో చర్చకు తీసుకుంటారు. సభ్యులు దీనిపై సవరణలను ప్రతిపాదించవచ్చు. ఆ సవరణలను ప్రభుత్వం ఆమోదించడమో, లేదా తిరస్కరించడమో చేయొచ్చు.
శాసన ప్రక్రియలో శాసనమండలి ముందుకు వచ్చిన బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పాలి కానీ ఆ బిల్లును అడ్డుకునే అధికారం లేదు అని రాజకీయ విశ్లేషకులు ప్రోఫెసర్ నాగేశ్వర్ చెపుతున్నారు. అసలు రూల్ 71 అనే నిబంధన శాసనసభ తీసుకొచ్చిన బిల్లులపై శాసనమండలి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఉద్దేశించింది కాదు. కేవలం ప్రభుత్వ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించే నిబంధన మాత్రమే. కానీ పరిపాలన వికేంద్రీకరణ విధాన రూపాన్ని దాటుకుని.. బిల్లుగా రూపం దాల్చింది కాబట్టి ఈ దశలో అభిప్రాయాన్ని చెప్పడం మండలి బాధ్యత. బిల్లు కన్నా ముందు విధానంపై అభిప్రాయాన్ని చెప్పడంలో అర్థం లేదు. కాబట్టి రూల్ 71 కింద నోటీసును అనుమతించడం తప్పుడు నిర్ణయం అని ప్రోఫెసర్ నాగేశ్వర్ అన్నారు.