ఎన్నికల వ్యూహం : కారెక్కుతున్న చిరుమర్తి లింగయ్య

  • Publish Date - March 8, 2019 / 04:00 PM IST

నల్గొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హస్తానికి హ్యాండిస్తారా, త్వరలోనే కారెక్కనున్నారా ? అంటే జిల్లాలో అవుననే వినిపిస్తోంది. మరి తమకు వీర విధేయుడైన చిరుమర్తి కారెక్కెందుకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఓకే చెప్పారా ?  ఇంతకీ నకిరేకల్ ఎమ్మెల్యే న్యూ జర్నీ వెనకున్న కథాకమామీషేంటో ఒకసారి చూద్దాం

ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల వేళ. తెలంగాణలో కాంగ్రెస్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ వేశారో లేదో… మొన్నటికి మొన్న రేగ కాంతరావు, ఆత్రం సక్కు టీఆర్ఎస్‌లో చేరుతున్నామంటూ ప్రకటించారు. ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్ ఉందనే సమయంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య… కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చిరుమర్తి.. రేపో మాపో గులాబీ గూటికి చేయడం ఖాయమనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. 

కోమ‌టి రెడ్డి బ్రదర్స్‌కు వీర‌విధేయుడిగా ఉన్న చిరుమ‌ర్తి లింగ‌య్య కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడానికి రెడీ అవడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది. హైకమాండ్ మీద ఒత్తడి తెచ్చి మరీ కోమటిరెడ్డి బ్రదర్స్ చిరుమర్తికి గత ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకున్నారు. సోదరుల అనుమతి లేకుండా అడుగు ముందుకు వెయ్యని ఆయన హఠాత్తుగా టీఆర్ఎస్‌లోకి ఎందుకు వెళ్తున్నారు. కోమటిరెడ్డి సోదరులకు విషయం చెప్పకుండా అయితే చిరుమర్తి పార్టీని వీడే సాహసం చేయరని టాక్ వినిపిస్తోంది. అయితే  టీఆర్ఎస్‌లోకి చిరుమర్తి లింగయ్య వెళ్లేందుకు సోదరులిద్దరి హస్తం ఉండి ఉండొచ్చనే చర్చ కూడా కాంగ్రెస్‌లో జరుగుతోంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్‌లోకి వెళ్తారని గత కొంత కాలంగా ప్రచారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్‌కు బదులు పటేల్ రమేష్‌రెడ్డికి నల్గొండ ఎంపీ సీటును ఇచ్చేందుకు అధిష్టానం ఓకె చెప్పిందట. అలాగే జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి కూడా నల్గొండ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో టికెట్‌ రాకపోవచ్చనే అనుమానంతో కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్‌వైపు చూస్తున్నారని టాక్. న‌ల్గొండ ఎంపి టికెట్ ఇస్తే ఓకే అన్నట్లు ప్రచారం ఉంది.  అయితే టిఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లుగా స‌మాచారం. దీంతో ఈ గ్రూప్ ప్యాక్‌లో భాగంగానే త‌మ ముఖ్య అనుచ‌రుడైన లింగ‌య్యను టీఆర్ఎస్‌లోకి  పంపిస్తున్నారనే వాదన కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ హై కమాండ్ కోమటిరెడ్డి ఎంపీ టికెట్ ఖరారు చేస్తే టీఆర్ఎస్‌లోకి వెళ్లకుండా ఉండేందుకే ఇప్పుడు లింగయ్య ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్సీ పోలింగ్ నాటికి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ఇద్దరు గోడ దూకుతారనే భయం కాంగ్రెస్‌లో ఉంది. ఇప్పుడు చిరుమర్తి తెరపైకి రావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో నల్గొండ అభ్యర్థి పేరును ప్రకటిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే విషయం ఆసక్తిగా మారింది.