బొత్సకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

  • Publish Date - November 26, 2019 / 06:51 AM IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నవంబర్ 28న అమరావతి పర్యటనకు రావటంపై పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.‘రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా’ అంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బొత్సకు  స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. 

రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా?
“రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష. తెదేపా హయాంలో రూ.52 వేల కోట్ల విలువైన నిర్మాణాలతో, వేలాది కార్మికులతో కళకళలాడుతూ, పర్యాటక జన సందోహంతో నిత్య సందడిగా ఉండేది. అటువంటి సజీవ స్రవంతి అమరావతిని స్మశానంగా శత్రువు కూడా పోల్చరు.కానీ మంత్రి బొత్సాగారు ప్రజారాజధానిని శ్మశానంతో పోల్చి 5కోట్ల ఆంధ్రులనే కాదు, శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖులను కూడా అవమానించారు అని చంద్ర బాబు ట్వీట్ చేశారు.

‘అక్కడున్న విశ్వవిద్యాలయాలు మీకు స్మశానాలా? హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ మీ కళ్లకు స్మశానాల్లా కనిపిస్తున్నాయా?రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా? నిర్మాణాల్లో చెమటోడ్చిన కూలీల శ్రమను ఎగతాళి చేస్తారా? ప్రజల మనోభావాలను గౌరవించలేని బొత్సకు మంత్రిగా కొనసాగే హక్కు లేదు. అమరావతి అభివృద్దిపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. అని ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.  కాగా .. బాబు వ్యాఖ్యలపై మంత్రి బొత్స, వైసీపీ నేతలు, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.