డిమాండ్ల సాధనకు, రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు ఎంపీలకు ఇదే మంచి అవకాశం..!

తెలుగు ఎంపీలంతా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి...తమ జీవితాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Ap, Telangana Development : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ఎంపీలు కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కీలకమయ్యేవారు. అప్పుడు 42 మంది ఎంపీ స్థానాలుండడం, గెలిచిన పార్టీకే ఎక్కువ ఎంపీ స్థానాలు రావడంతో కేంద్ర ప్రభుత్వాలకు టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారు ఆయువుపట్టుగా ఉండేవారు. విభజన తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాలు కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. బీజేపీ, ఎన్డీఏ కూటమికి రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు 29 మంది ఎంపీల మద్దతు ఉన్నట్టు అయింది. మిత్రపక్షాలు లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్న బీజేపీకి ఈ 29 అనే సంఖ్యకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలు విభజన సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కీలక మార్పు..
కేంద్రంలో 2014, 2019లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర ఉత్తర భారతం నుంచి ఎన్నికైన ఎంపీలే. దక్షిణాదిన బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో ఉత్తర భారతదేశంపైనే దృష్టి కేంద్రీకరించి.. అక్కడే కావాల్సినన్ని సీట్లు దక్కించుకుంది. కానీ ఈసారి అన్ని స్థానాలు బీజేపీ సాధించలేకపోయింది. అదే సమయంలో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో మిత్రుల రూపంలోనూ, సొంతంగానూ బలం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కీలక మార్పు జరిగింది.

టీడీపీకి ఇదే మంచి తరుణం..
ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గరి నుంచి అందరి చూపు టీడీపీపై పడింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత 16 స్థానాలతో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఉండడమే దీనికి కారణం. ఎన్డీఏలో తాము భాగంగా ఉన్నామని… ఆ కూటమిలోనే ఉంటామని చంద్రబాబు స్పష్టంచేశారు. అయితే ఎన్డీఏకు టీడీపీ మద్దతు తప్పనిసరిగా మారిన పరిణామాన్ని ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా చంద్రబాబు ఎలా మారుస్తారన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది మంచి తరుణమని, ఏపీ సమస్యలను తీర్చడానికి టీడీపీకి దక్కిన అపురూప అవకాశమని అంతా భావిస్తున్నారు.

ఏపీ స్వరూపాన్ని మార్చేయాలి..
ఏపీ నుంచి ఉన్న 21 మంది ఎంపీలు, వైసీపీ ఎంపీలను కూడా కలుపుకుపోయి.. రాష్ట్ర సమస్యలను తీర్చేందుకు కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నది ప్రజల ఆకాంక్ష. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అన్నది అత్యవసరం. అలాగే నిధులు విడుదల, అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటే…రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ ఐదేళ్లూ…రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడపడానికి, ఆటంకాలు లేని పాలన సాగించడానికి, ఏపీ స్వరూపాన్ని మార్చివేయడానికి చంద్రబాబు కృషిచేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.

పార్టీలకతీతంగా నేతలు కేంద్రంపై ఒత్తిడి చేసి అనుకున్నవన్నీ సాధించాలి..
విభజనతో నష్టపోయిన రాష్ట్రం గాడిన పడాలంటే కేంద్రం సహాయసహకారాలు తప్పనిసరి. కానీ ఈ పదేళ్లలో కేంద్రం ఏపీకి అండగా నిలవలేదనే చెప్పాలి. అయితే కేంద్రానికి అండగా నిలిచి…రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఏపీ ఓటర్లు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు ఇచ్చారు. పార్టీలకతీతంగా నేతలు కేంద్రంపై ఒత్తిడి చేసి అనుకున్నవన్నీ సాధించాలి. నీటి ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలతో పాటు అనేక కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే యువతకు ఉపాధి పెరుగుతుంది. వలసలు తగ్గుతాయి. అంతిమంగా రాష్ట్రానికి అనుకున్న మేలు జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎంపీలు ఉపయోగించుకోకపోతే రాష్ట్రానికి మరింత అన్యాయం జరుగుతుంది. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే.. ప్రజల దృష్టిలో నేతలంతా దోషులుగా మిగిలిపోయే ప్రమాదముంది.

తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ఒత్తిడి చేయాలి..
ఏపీ ఓటర్లే కాదు.. తెలంగాణ ఓటర్లూ ఈ ఎన్నికల్లో అనూహ్య తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో సమానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సీట్లు కట్టబెట్టారు. గతంలో ఎన్నడూ అధికారంలో లేని రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ సీట్లు సాధించడం సాధారణ విషయం కాదు. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున ఎన్నికైన ఎంపీలందరికీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అవకాశం లభించింది. ఐటీ ప్రాజెక్టులు, విభజన సమస్యలు… బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటి సాధనకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

మా జీవితాలను బాగు చేయాలంటున్న ప్రజలు..
మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి, మిత్రపక్షాలకు కలిపి 29 మంది ఎంపీలున్నారు. NDA ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సంఖ్యకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఎంపీలంతా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి…తమ జీవితాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Also Read : చంద్రబాబు క్యాబినెట్‌లో ఉండేదెవరు? పవన్, లోకేశ్‌లకు దక్కే మినిస్ట్రీ ఏది? జిల్లాల వారీగా వివరాలు..