Telangana Tdp President Race: ఒకప్పుడు ఆ పార్టీ హైదరాబాద్ సెంట్రిక్‌గానే నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఓవర్ టు అమరావతి అయిపోయింది. అయినా ఇప్పుడు తెలంగాణలో క్యాడర్, లీడర్లు ఉండటంతో పాటు..మూడు నాలుగు జిల్లాల్లో పట్టున్న పార్టీ..పావులు కదుపుతోందట సైకిల్ పార్టీ. త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమించి.. పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నాట. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవాలనే ప్లాన్‌లో ఉన్నారట చంద్రబాబు. స్థానిక ఎన్నికలతో పాటు GHMC ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో టీడీపీ పార్టీ ఉన్నట్లు టాక్.
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేకుండా పోయాడు. దాదాపు రెండేళ్లుగా తెలంగాణలో పార్టీకి అధ్యక్షుడు లేడు. దీంతో పార్టీ ఏ కార్యక్రమాలను చేపట్టలేకపోతోంది. దీంతో అసలు రాష్ట్రంలో పార్టీ మనుగడలో ఉందా అన్న సందేహంతో టీడీపీలో ఉన్న నేతలు, క్యార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యం చేయకుండా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని నియమించాలని పార్టీ ముఖ్య నేతలు కొందరు చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ నేతలతో ఇటీవల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..పార్టీ పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం.
పార్టీని మెల్లమెల్లగా యాక్టీవ్ మోడ్‌లోకి తీసుకురావాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం చేపట్టాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా త్వరలోనే పూర్తిస్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తానని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారట.
ఈ క్రమంలో తెలంగాణ టీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపై చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీటీడీపీలో కీలకంగా ఉన్న అరవింద్ కుమార్ గౌడ్‌తో పాటు పార్టీలో చేరబోతున్న తీగల కృష్ణా రెడ్డి, ఇటీవల పార్టీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట.
ఆ మధ్య చంద్రబాబును కలిసిన బాబు మోహన్ తనకు తెలంగాణ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని తన మనసులోని మాటను బయటపెట్టారట. ఇదే సమయంలో హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. చాలా రోజుల క్రితమే హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన తీగల..ఈ నెలలోనే అఫీషియల్‌గా సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారట. ఈ క్రమంలో తీగల కృష్ణారెడ్డి కూడా టీటీడీపీ అధ్యక్ష్య పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ముందు నుంచి టీడీపీ పార్టీలో కీలకంగా ఉన్న పొలిటి బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నారట. దీంతో ఎవరిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్నదానిపై డైలమా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. టీడీపీకి అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కూడా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో హైదరాబాద్ రాబోతున్న చంద్రబాబు..ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించి పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
స్థానిక సంస్థలు, ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో టీడీపీ ఊనికిని చాటుకునే ప్రయత్నం చేయబోతోందట. ఇప్పటికీ తెలంగాణలో తమకున్న హార్డ్ కోర్ క్యాడర్‌లో జోష్ నింపి..ఇక్కడ పార్టీకి పూర్వవైభవం తేవాలనే లక్ష్యంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్న చర్చ జరుగుతోంది.
Also Read: లోకల్ ఫైట్.. బరిలోకి నేతల కూతుర్లు, కుమారులు, భార్యలు.. పొలిటికల్ అరంగేట్రంకు ప్లాన్..