Nominated Posts: ఊరిస్తున్న నామినేటెడ్‌ పోస్టులు..! ఇంకా ఏయే పదవులు ఫిలప్ కాలేదు? రేసులో ఉన్న కీలక నేతలు ఎవరు?

గత ఐదేళ్ల పనితీరునే లెక్కలోకి తీసుకుని పదవులు ఇస్తామని చెప్తున్నారట. పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కకపోవడంతో.. (Nominated Posts)

Nominated Posts: ఏపీలో నామినేటెడ్‌ రేసు ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మూడు నాలుగు విడతలుగా..దాదాపు అందరికీ పదవులు ఇచ్చారు. ఇంకొన్ని పోస్టులు మిగిలి ఉన్నాయి. ఇంకా ఎందరో నేతలు రాష్ట్ర స్థాయి నేతలు నామినేటెడ్‌ పోస్ట్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. భర్తీ కాని కీలక కార్పొరేషన్‌ పదవుల కోసం పార్టీ ఆఫీస్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట నేతలు. ఇంకా ఏయే పోస్టులు ఫిలప్ కాలేదు? రేసులో ఉన్న కీలక నేతలు ఎవరు?

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటి పోయింది. ఇప్పటికి మూడు నాలుగు సార్లు నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. లేటెస్ట్‌గా మరో 31 పోస్టులు పంపకాలు జరిగాయి. ఇందులో టీడీపీ నేతలకే ఎక్కువ పదవులు దక్కాయి. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నాయకులకు కూడా పదవులిచ్చినా కోటా పరంగా టీడీపీ నేతలకు ఎక్కువ ప్రయారిటీ దక్కింది. ప్రధాన కార్పొరేషన్లను కేటాయించడంతో పోస్టుల భర్తీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఎన్నికలకు ముందు టీడీపీ యువనేత నారా లోకేశ్ చెప్పినట్లు అప్పట్లో పార్టీ కోసం పోరాడిన వారికే కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కినట్లు కనిపిస్తోంది. అప్పటి ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన వారికి పెద్దపీట వేశారని చెబుతున్నారు. అమరావతి రాజధాని ఉద్యమంతో పాటు చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేలా పోరాడిన వారికి పదవులిచ్చారు.

టీడీపీ యువనేత బ్రహ్మం చౌదరికి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. చంద్రబాబుకు విధేయుడుగా చెప్పే నాగుల్ మీరాకు..నూర్ బాషా, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. జనసేన కోటాలో షేక్ రియాజ్‌కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవితో పాటు పలువురికి బెర్తులు కల్పించారు. ఇలా చాలా పోస్టులు భర్తీ కాగా ఇంకొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల కోసం కూడా ఇంకా చాలా మంది నేతలు రేసులో ఉన్నారు.

మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ఆ పోస్టులు..!

ఇంకా భర్తీ కాని కీలక కార్పొరేషన్ పోస్టుల కోసం లాబీయింగ్ చేస్తున్నారట ఆశావాహులు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిసి తమ దరఖాస్తు అందజేస్తున్నారట. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ లాంటి కార్పొరేషన్ పోస్టులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ఈ పోస్టులు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.(Nominated Posts)

ఇక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనసేనకి ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోస్ట్‌ నిర్మాత ఏఎం రత్నంకి ఇస్తే బాగుంటుందంటూ ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు పవన్ కల్యాణ్. అయితే ఈ పోస్ట్‌కు పోటీ ఎక్కువగా ఉందంటున్నారు.

ఇక గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, చెన్నుపాటి గాంధీ, నల్లపాటి రాము, కనపర్తి శ్రీనివాసరావు, బిరిజేపల్లి వెంకటేష్, చిరుమామిళ్ల మధు, ఏవి రమణ, దారపునేని నరేంద్ర పరుచూరి కృష్ణ, ఆచంట సునీత, కొత్త నాగబాబు, కిరణ్, పాతర్ల రమేష్ వంటి నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో కీలక దేవాలయాలకు సంబంధించిన పాలక మండళ్లు ఏర్పాటు చేయబోతున్నారు. వాటిలో చాలామంది నేతలకు అవకాశం వస్తుందని హైకమాండ్ చెబుతుంది. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ నేతల సిఫార్సులకు పట్టించుకోబోమంటోందట అధిష్టానం.

గత ఐదేళ్ల పనితీరునే లెక్కలోకి తీసుకుని పదవులు ఇస్తామని చెప్తున్నారట. పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కకపోవడంతో మంచి కార్పొరేషన్ పోస్ట్ అడుగుతున్నారట. అటు గత ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు అయితే ఎమ్మెల్సీ కోసం పట్టుబడుతున్నారట. ఎమ్మెల్సీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే నామినేటెడ్‌ పోస్ట్‌ కట్టబెట్టాలని భావిస్తోందట టీడీపీ హైకమాండ్.(Nominated Posts)

ఇప్పటికైతే చాలా పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక మిగిలి ఉంది ఐదు పది పోస్టులు మాత్రమే. ఆ పదవుల కోసం వంద మంది నేతలు దరఖాస్తులు పెట్టుకుని పైరవీలు చేస్తున్నారట. మరి ఆ కీలక పోస్టులు ఎవరికి దక్కబోతున్నాయో..అసంతృప్తులను ఎలా చల్లారుస్తారో చూడాలి.

Also Read: జగన్ కంచుకోట బద్దలు..! పులివెందుల గెలుపుతో టీడీపీ ఇచ్చిన ఇండికేషన్ ఏంటి? బైపోల్‌ను ఎందుకింత ప్రెస్టేజ్‌గా తీసుకుంది?