Telangana Government: ఖజానా ఖాళీ? పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో తెలంగాణ సర్కార్? సవాళ్లు దాటేదెలా..
రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ఆదాయం వస్తే దాదాపు 108 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని కోసం ప్రతినెల అప్పులు చేయాల్సి వస్తోంది.
- Naveen
- Published on- June 2, 2026 / 10:49 PM IST
- ఎమ్మెల్యేలతో మీటింగ్‌లో భట్టి కామెంట్స్‌కు అర్థమేంటి?
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడేదెప్పుడు?
- కాగ్ రిపోర్ట్‌తో తేటతెల్లమైన సర్కార్ ఆర్థిక పరిస్థితి!
Telangana Government: కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ బండిని నడపలేక దిక్కులు చూస్తోందా? ఏం చేయాలో తోచక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారా? తెలంగాణ సర్కార్‌కు ఆర్థిక కష్టాలు కొత్త తలనొప్పులు తెస్తున్నాయా? నిధుల లేమితో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఏకంగా ఆర్థిక శాఖ మంత్రే ఎమ్మెల్యేలతో ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆర్థిక పరిపుష్టికి ఇంకా సమయం పడుతుందని..అప్పటిదాకా కొత్తగా నిధులు ఇవ్వలేమంటూ ఏకంగా ఆర్థిక మంత్రే చేతులెత్తేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇలా అయితే ఇక ప్రజల్లోకి వెళ్లేది ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు.
తెలంగాణ సర్కార్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. అవును. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ఇదే స్పష్టం చేస్తోంది. లోటు బడ్జెట్‌తో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు కాగ్ స్పష్టం చేసింది. హామీల అమలుకు ఆర్థిక స్థితి అడ్డంకిగా మారుతోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇస్తే..వాటిని అమలు చేయడం ఇప్పుడు సర్కార్‌కు సవాల్‌గా మారింది. బడ్జెట్ అంచనాలకు..వాస్తవాలకు పొంతన లేని పరిస్థితి. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ఆదాయం వస్తే దాదాపు 108 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని కోసం ప్రతినెల అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో కేవలం రెండున్నర ఏళ్లలోనే 4.14 లక్షల కోట్ల అప్పులను తెచ్చింది సర్కార్. గతంలో ఉన్న అప్పులకు..అసలు, వడ్డీలు కట్టలేక నడ్డి విరుగుతుంటే..మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లుగా కొత్తగా అవుతున్న లక్షల కోట్ల అప్పులు రేవంత్ ప్రభుత్వానికి గుదిబండగా మారాయి.
ప్రతి నెలా దాదాపు రూ.18 వేల నుంచి 20 వేల కోట్ల ఖర్చు..
అటు సంక్షేమాన్ని.. ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాటపడుతుంటే..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతోంది. దీంతో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు…కొత్త కొత్త పనులు, ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ సర్కార్ ముందుకెళ్తోంది. వాస్తవంగా ప్రతి నెల జీతాలు, పెన్షన్లు, అసలు, వడ్డీల చెల్లింపు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, ఇతర చెల్లింపులు అన్ని దాదాపు 18 వేల నుంచి 20 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. కానీ వాస్తవ రాబడి మాత్రం కేవలం 16 నుంచి 18 వేల కోట్లలోపే ఉంటుంది. అంటే దాదాపు ప్రతి నెల సగటున రూ.2,250 కోట్ల లోటు సర్కార్ కు సవాల్ గా మారుతోంది. ప్రభుత్వం శక్తికి మించి కార్యక్రమాల అమలుకు, కొత్త అభివృద్ధి పనులను చేపట్టడం.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందన్నట్లుగా తయారైంది పరిస్థితి.
ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భట్టి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలకో, సంవత్సరానికో పరిస్థితి కుదుట పడుతుందని భట్టి తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ప్రభుత్వం ఎప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుందో? ఖజానా ఎప్పుడు కళకళలాడుతుందో? అప్పులు తీసుకునే అవసరం తగ్గుతుందో లేదో అనేది చూడాలి.
