తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇంకెప్పుడు? అసలు అడ్డుకుంటున్నది ఎవరు?

ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్‌లో అదనంగా మ‌రో ఆరుగురికి చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఈ ఆరు స్థానాల కోసం..ప‌దుల సార్లు..అధిష్టానంతో చ‌ర్చోప చ‌ర్చలు.. మంత‌నాలు జ‌రిగాయి.

Gossip Garage Telangana Cabinet Expansion On Hold (Photo Credit : Google)

Gossip Garage : మొద‌ట సంక్రాంతి అన్నారు. త‌ర్వాత‌ మూఢాలు అడ్డొచ్చాయన్నారు. ఉగాదికి ప‌క్కా అన్నారు. అదీ కుదరలేదు. ద‌స‌రా అయిపోయింది. దీపావళి దగ్గరికి వచ్చింది. కానీ తెలంగాణ మంత్రివర్గ విస్తర‌ణ‌పై మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌టం లేదు. దీపావ‌ళికి కూడా మంత్రివర్గ విస్తరణ కష్టమేనని ఢిల్లీ పెద్దలు చేప్పేశార‌ట. అమాత్య యోగం కోసం వెయిట్ చేస్తున్న నేతలు..బుగ్గ కారుతో వెలిగిపోయేదెప్పుడని ఎదురుచూస్తున్నారు. ఇంతకు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు.? అడ్డుకుంటుందని ఎవరు.? అధిష్టానం మదిలో ఏముంది.?

నెలలు గడుస్తున్నా విస్తర‌ణ మాత్రం జ‌ర‌గ‌డం లేదు…
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది. పండ‌గలు వస్తున్నాయి..పోతున్నాయి. మూఢాలు తొలిగిపోయి..శుభ ముహూర్తాలు క‌రిగి పోతున్నాయి. అయినా క్యాబినెట్‌ విస్తరణపై సాగదీత కొనసాగుతోంది. వాయిదాలతో ఆశావహుల ఆశ‌ల‌పై నీళ్ళు చల్లుతున్నట్లు అవుతోంది. బుగ్గకారు కోసం కంట్లో వ‌త్తులేసుకుని ఎదురు చూస్తున్నారు ఎమ్మెల్యేలు. ఢిల్లీ, సీఎం రేవంత్ చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తున్నారు ఆశావహులు. గ‌తేడాది డిసెంబ‌ర్ 7న సీఎంగా అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి..త‌న‌తో పాటు 11మందితో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి క్యాబినెట్‌ విస్తర‌ణ ఊరిస్తూనే ఉంది. నెలలు గడుస్తున్నా విస్తర‌ణ మాత్రం జ‌ర‌గ‌డం లేదు.

ముందు సంక్రాంతికి అన్నారు, ఆ తర్వాత ఉగాదికి అన్నారు..
ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్‌లో అదనంగా మ‌రో ఆరుగురికి చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఈ ఆరు స్థానాల కోసం..ప‌దుల సార్లు..అధిష్టానంతో చ‌ర్చోప చ‌ర్చలు.. మంత‌నాలు జ‌రిగాయి. డిసెంబ‌ర్ 7న కొత్త ప్రభుత్వం కొలువుదీరిన త‌ర్వాత‌..సంక్రాంతికి పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తర‌ణ చేసుకోవాల‌ని భావించారు సీఎం రేవంత్ రెడ్డి. అదే ఊపులో ఢిల్లీ పెద్దల‌తో మంత‌నాలు జ‌రిపారు. అయితే అంతలోపు సంక్రాంతి మూఢాలు కూడా వెళ్లిపోయాయి. కానీ క్యాబినెట్‌ విస్తర‌ణ‌పై ఏ నిర్ణయం జర‌గ‌లేదు. ఇదేంటి అనుకునేలోపు.. ఉగాదికి విస్తర‌ణ ఉంటుందని సెల‌విచ్చారు. అయితే ఉగాది వ‌చ్చింది పోయింది. కానీ ఆ ఆరు అమాత్య బెర్తులు ఫిలప్ కాలేదు.

కొత్త ఆశలు చిగురించేలోపు మరో షాక్ ఇచ్చిన అధిష్టానం..
ఉగాది తర్వాత ఆషాఢ మాసం తెర‌పైకి వ‌చ్చింది. అయితే క్యాబినెట్ విస్తర‌ణ మాత్రం జ‌ర‌గ‌లేదు. లోక్‌స‌భ ఎన్నిక‌లు ఉండ‌టంతో..ఎన్నిక‌ల ముందు అసంతృప్తుల గోల ఎందుక‌ని అధిష్టానం విస్తర‌ణ‌ను వాయిదా వేసింది. మ‌రోవైపు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక త‌ర్వాత‌.. విస్తర‌ణ ప‌క్కా అంటూ ప్రచారం జ‌రిగింది. చెప్పిన‌ట్లుగానే పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్‌ కుమార్ గౌడ్ నియామ‌కం పూర్తి చేసింది. ఇక అన్నీ అడ్డంకులు తొలిగిపోయాయి. ద‌సరా పండుగ‌కు కొత్త మంత్రులు వ‌స్తార‌ని అధిష్టానం లీకులు ఇచ్చింది. బుగ్గకారుతో ద‌స‌రా పండుగ‌ చేసుకోవచ్చనుకున్న ఆశావహుల ఆశ‌ల‌పై మ‌రోసారి నీళ్లు చల్లింది పార్టీ హైక‌మాండ్. దీంతో జరిగిందేదో జ‌రిగింది. ఈ దీపావ‌ళికి మాత్రం ప‌క్కా..అంటూ కొత్త ఆశలు చిగురించేలోపు మరో షాక్ ఇచ్చారు అధిష్టానం పెద్దలు.

ఇంత‌కు మంత్రివ‌ర్గ విస్తర‌ణ ఉంటుందా? లేదా?
మంత్రులుగా దీపావ‌ళి చేసుకోవాల‌నుకున్న ఎమ్మెల్యేల ఆశలకు ఆ సంబరం కూడా దక్కేలా లేదు. మ‌హారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నిక‌ల‌ బిజీలో ఉన్నాం..ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌పై మాట్లాడ‌లేమంటూ ఢిల్లీ పెద్దలు సెల‌విచ్చార‌ట‌. దీంతో కొండంత ఆశ‌ పెట్టుకున్న ఆశావహుల గుండెలు మ‌రోసారి గుభేల్‌మన్నాయట. దీంతో ఇంత‌కు మంత్రివ‌ర్గ విస్తర‌ణ ఉంటుందా. ? ఉంటే ఎప్పుడు ఉంటుంది.? అంటూ గుర్రుగా ఉన్నారట ఎమ్మెల్యేలు. క‌నీసం వ‌చ్చే సంక్రాంతికైనా మంత్రి యోగం దక్కుతుందా లేదా అని కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు ఆశావహులు.

 

Also Read : మూసీ ప్రక్షాళన కోసం అధ్యయనానికి టూర్.. సీఎం వెళ్లొచ్చాక మంత్రులు వెళ్లడం ఎందుకని ప్రశ్నలు