Gudur MLA Varaprasad Meets Pawan Kalyan
MLA Varaprasad : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీలో ఇంఛార్జిల మార్పులు చేర్పుల వ్యవహారం కలకలం రేపుతోంది. టికెట్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.
తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. జనసేన పార్టీలో చేరికపై చర్చించారు. గూడూరు ఇంఛార్జిగా ఎమ్మెల్సీ మేరుగ మురళీని వైసీపీ నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారు వరప్రసాద్.
Also Read : వైఎస్ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?
వైసీపీలో మార్పులు చేర్పుల్లో భాగంగా మాజీ ఐఏఎస్, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కు టికెట్ నిరాకరించారు సీఎం జగన్. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. దాదాపు అరగంటపాటు పవన్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జనసేనలో చేరి రాబోయే ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన తనకు ఉన్నట్లు వరప్రసాద్ తన మనోగతాన్ని పవన్ కు వెల్లడించినట్లు సమాచారం. వరప్రసాద్ రహస్యంగా వచ్చి పవన్ ను కలిశారు.
ఎమ్మెల్సీగా ఉన్న మేరుగు మురళీకి గూడూరు అసెంబ్లీ స్థానం కేటాయించారు సీఎం జగన్. దీంతో వరప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. స్థానిక నేతలతోనూ ఆయనకు పడని పరిస్థితి ఉంది. అధికార పార్టీకి దూరంగా ఉంటున్నారు. జనసేన నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు పవన్ కు వెల్లడించారు వరప్రసాద్. గూడూరులో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిగా సునీల్ కుమార్ ఉన్నారు. గతంలో 2014లో తిరుపతి పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు వరప్రసాద్. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంటుకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వరప్రసాద్ పవన్ కల్యాణ్ ను కోరినట్లు సమాచారం.
కాగా, దీనిపై వరప్రసాద్ కు పవన్ కల్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పార్టీలో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని పవన్ కల్యాణ్ ఆయనతో అన్నట్లు సమాచారం. తిరుపతి జనసేన నేతలతో చర్చించిన తర్వాత పవన్ కల్యాణ్ దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పవన్ కల్యాణ్ ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన చాలామంది నేతలు జనసేనతో టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?