Gutha Sukender Reddy : బీఆర్ఎస్ ఘోర ఓటమికి కారణం అదే- గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

స్వయంకృషితోనే నాకు పదవి వచ్చిందని, ఎవరో పెట్టిన భిక్ష కాదని గుత్తా అన్నారు.

Gutha Sukender Reddy : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారాయన. సంస్థాగత నిర్మాణ లోపం వల్లే అసెంబ్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందన్నారాయన. స్వయంకృషితోనే నాకు పదవి వచ్చిందని, ఎవరో పెట్టిన భిక్ష కాదని గుత్తా అన్నారు.

”సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్లే బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలు కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేల అహంకారం కొంపముంచింది. కొన్ని జిల్లాల్లో పార్టీ క్షేత్ర స్థాయిలో పూర్తిగా కొలాప్స్ అయింది. సంస్థాగత నిర్మాణం, బలం లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించదు. నేను ఎంపీ అయిన నాడు జగదీశ్ రెడ్డి లాగులు కట్టుకొని తిరుగుతుండే. ఇవ్వాళ నా మీద మాట్లాడుతుండు. నాకు పదవి స్వయం కృషితో వచ్చింది. ఎవరో పెట్టిన భిక్ష కాదు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను పట్టించుకోలేదు. జిల్లా ఎమ్మెల్యేలకు సమస్యల మీద అవగాహన లేదు. ఎస్ ఎల్ బీసీ, బ్రాహ్మణ వెల్లంల పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేయించలేక పోయారు.

నాకే ఎన్నికలకు ముందు 6 నెలల అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నా తనయుడు అమిత్ ఎంపీ టికెట్ కోసం ఆశపడ్డ మాట వాస్తవం. పార్టీ కూడా సుముఖత తెలిపింది. కానీ ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేల సహకారం సరిగా లేదు. మాజీ సీఎం కేసీఆర్, రాష్ట్ర నేతలకు ఇంటికి భోజనానికి వస్తే జిల్లా నేతలు మొహం చాటేశారు.

కొంతమంది ముందే పార్టీ మారుతున్నామని తెలిపారు. వాళ్ళను నమ్ముకొని ఎలా ఎన్నికల్లో పోటీ చేయాలి? ఎమ్మెల్సీల అనర్హత విషయంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తాను. నేను రాజ్యాంగ పదవిలో ఉన్నాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాకు సమానమే. నేను ఏ పార్టీలో చేరబోను” అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Also Read : వారు అందరూ బీజేపీలోకి వస్తున్నారు.. చివరికి రేవంత్ రెడ్డి కూడా వస్తారు: ఎంపీ అర్వింద్

 

ట్రెండింగ్ వార్తలు