తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పు రాబోతోంది. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందోనని అటు బాధిత కుటుంబీకులతో పాటు ఇటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలికల అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. నల్గొండ పోక్సో కోర్టు నేడు వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
ఈ ఏడాది జనవరి 6 నుంచి మొదలైన ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదోపవాదాల ప్రక్రియ 17న ముగిసింది. దీంతో న్యాయస్థానం తీర్పును 2020, జనవరి 27వ తేదీ సోమవారానికి వాయిదా వేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ బలంగా వాదన వినిపించిన నేపథ్యంలో ఫోక్సో కోర్టు ఎటువంటి తీర్పును వెల్లడిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది. దిశ నిందితుల తరహాలోనే శ్రీనివాసరెడ్డిని శిక్షించాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు.
ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో అతడు వరంగల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. విచారణ కోసం ప్రభుత్వం నల్లగొండలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరిగింది. ఈ కేసులో మొత్తం 300 మందిని సాక్షులుగా పేర్కొనగా… 101 మందిని ప్రశ్నించారు.
దానితో పాటు శ్రీనివాస్ రెడ్డి కామ దాహానికి బలైన ముగ్గురు బాలికల పోస్ట్ మార్టం నివేదిక, డీఎన్ఏ రిపోర్టులు, దర్యాప్తు సందర్భంగా లభ్యమైన ఆధారాలను జతచేశారు. మైనర్ బాలిక అత్యాచారం, హత్య జరిగిన 60 రోజుల వ్యవధిలోనే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలాన్ని సైతం నమోదు చేశారు. విచారణ సమయంలో శ్రీనివాసరెడ్డిని జడ్జి పలు ప్రశ్నలు అడుగగా సమాధానమివ్వకుండా మౌనం వహించాడు. తనకేం తెలియదని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు సేకరించిన ఆధారాలు పక్కాగా ఉండటంతో అతడి ఆటలు సాగలేదు.
ఇప్పటికే నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో.. హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఉరిశిక్ష విధించాలని అన్నివర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఒకవేళ నిందితుడికి ఉరిశిక్ష విధించినట్లయితే నల్లగొండ జిల్లా కోర్టులో ఉరిశిక్ష విధించబడిన తొలి కేసుగా రికార్డుల్లోకి ఎక్కనుంది.