హైదరాబాద్‌లో దేశ ద్రోహులున్నారు – లక్ష్మణ్

  • Publish Date - February 24, 2020 / 12:57 PM IST

హైదరాబాద్‌లో దేశ ద్రోహులున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతల బృందం కలిసింది. దొంగ పత్రాలతో ఆధార్ కార్డులు పొందిన వారిపై విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. రోహింగ్యాలు దొంగ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు పొందారని ఆరోపించారు. అక్రమ పత్రాలు కలిగిన వారి డేటాను డీజీపీకి అందించడం జరిగిందన్నారు.

రోహింగ్యాలకు ఎంఐఎం మద్దతివ్వడం వెనుక మతలబు ఏంటీ అని ప్రశ్నించారు. CAA, NPRలపై ఎంఐఎం నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతోనే వారు సవాళ్లు విసురుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మార్చి 15వ తేదీన బీజేపీ నిర్వహించే సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొననున్నారని, ఈ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్. 

కొద్ది రోజులుగా రోహింగ్యాల అంశం కుదుపేస్తోంది. రోహింగ్యాలకు ఆధార్ కార్డులు, ఇతరత్రా ధృవపత్రాలు ఇవ్వడానికి ఏజెంట్లు కృషి చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని ఆధార్ అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై బీజేపీ నేతలు పలు విమర్శలు చేస్తున్నారు.

నగరంలో ఆరు వేల మందికిపైగా రోహింగ్యాలున్నారని, వీరు ఎలా వచ్చారు ? వీరికి ఆశ్రయం కల్పించింది ఎవరు అంటూ ప్రశ్నించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రోహింగ్యాలపై వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం నివేదికలు తెప్పించుకొంటోందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో రోహింగ్యాలు ఆందోళన చెందుతున్నారు. తమను ఏ క్షణమైనా పంపిస్తారని వీరు బిక్కుబిక్కుమంటున్నారు. జమ్మూ కాశ్మీర్ తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధికంగా రోహింగ్యాలు ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఐబీ హెచ్చరికలతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు రోహింగ్యాలపై దృష్టి సారించారు. 

Read More : జగనన్న వసతి దీవెన : పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే – సీఎం జగన్