BSP-Mayawati: బహుజన్ సమాజ్ పార్టీలో 10 నెలల క్రితమే చేరిన ఇమ్రాన్ మసూద్.. అంతలోనే పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇమ్రాన్ మసూద్‌ను బీఎస్పీ నుంచి బహిష్కరించడం చాలా పెద్ద చర్చే సాగుతోంది. అయితే ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. గత వారం ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశమయ్యారు. అనంతరం మూడు రోజుల క్రితం బీఎస్పీ సుప్రెమో మాయావతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. ఇత్యాధి కారణాల దృష్ట్యా ఆయనను పార్టీ నుంచి మాయావతి తొలగించారు. ఇమ్రాన్ మసూద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించారని మాయావతి ఒక ప్రకటనలో తెలిపారు.
కొద్ది రోజుల క్రితం.. ఇమ్రాన్ మసూద్ కోడలు ఖదీజా మసూద్.. ఉత్తరప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల సమయంలో సహరాన్‌పూర్ నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆమె భారతీయ జనతా పార్టీ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇమ్రాన్ మసూద్ తన సొంత కోటలో విజయం సాధించలేక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇమ్రాన్ మసూద్.. కొద్ది కాలానికి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అనంతరం 10 నెలల క్రితమే బీఎస్పీలో చేరారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున సహరాన్‌పూర్ నుంచి పోటీకి దిగవచ్చని అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు మాయావతి గత వారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి ఇమ్రాన్ మసూద్ గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి ఇమ్రాన్ మసూద్ మరోసారి కొత్త రాజకీయ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమయ్యాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సమావేశంలోనే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని మాయావతి ప్రకటించారు. ఇమ్రాన్ మసూద్ అక్టోబర్ 2022లో బీఎస్పీలో చేరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నకుడ్ అసెంబ్లీ స్థానం నుంచి తనకు టికెట్ ఇవ్వనందుకు సమాజ్ వాదీ పార్టీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను అహంకారి అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.