నెలాఖరు నుంచి కార్యకర్తలతో పవన్ సమావేశాలు

  • Publish Date - January 17, 2020 / 02:52 PM IST

జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ జనవరి నెలాఖరు నుంచి  పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీజేపీతో  జనసేన పొత్తు.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం … స్ధానిక సంస్ధలలో పార్టీ  అనుసరించాల్సిన వ్యూహలపై ఆయన  వారికి ఈ సమావేశాల్లో  దిశానిర్దేశం చేయనున్నారు.  శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.   

ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి  పార్టీ గురించి  కష్టపడుతున్న వారి జాబితాలు తయారు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీలో మొదటి నుంచి ఉండి కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి జాతీయ, ప్రాంతీయ, ప్రాధ్యాన్యతా అంశాలపైనా… పార్టీ ఆలోచనా విధానం, వర్తమాన రాజకీయాలు తదితర అంశాలలో శిక్షణ ఇవ్వాలని సూచించారు.  

గత ఎన్నికల్లో పోటీచేసిన యువనాయకులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలని పవన్ ఆదేశించారు.  పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలి అనుకునే వారిని గుర్తించి వారితో సేవాదళ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.