జనసేన పార్టీ ఇంటర్వ్యూలు: ఎంపీ సీట్లకు బయోడేటాలు పంపండి

రాజకీయాల్లో కొత్త కోణం.. జనసేన పార్టీకి లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంచుకునే క్రమంలో సరికొత్త పథకంతో ముందుకు వచ్చింది జనసేన. శనివారం మార్చి 16న ట్విట్టర్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. జనసేన తరపున తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు పోటీ చేసేందుకు తాము అభ్యర్థిత్వాలను పరిశీలించమంటూ హైదరాబాద్, విజయవాడల్లోని జనసేన కార్యాలయాల్లో దరఖాస్తును చాలా మంది నేరుగా అందజేశారు. 

ఆసక్తి ఉన్నవారు.. సేవ చేయాలనే భావం ఉన్నవారి కోసం ఇరువురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లుగా జనసేన పార్టీ తెలిపింది. స్వయంగా బయోడేటాలను ఈ కమిటీకి అందజేయవచ్చని వెల్లడించింది. జనసేన పార్టీ మూల సిద్దాంతాలు, పార్టీ విధానాలపై విశ్వాసం ఉన్న సేవాతత్పరులు మాత్రమే బయోడేటాలను కమిటీకి సమర్పించాలని పేర్కొంది. పార్టీ నాయకులు శ్రీ నేమూరి శంకర్ గౌడ్, శ్రీ అర్హం ఖాన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 

హైదరాబాద్ మాదాపూర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10గంటల నుంచి ఆశావహులు తమ బయడేటాలు అందజేసేందుకు అవకాశం కల్పించారు. హైదరాబాద్( మాదాపూర్ )కార్యాలయంలో 3 రోజుల పాటు ఈ కమిటీ బయోడేటాలు స్వీకరిస్తుంది. ఆశావహుల ప్రొఫైల్స్, రాజకీయ నేపథ్యాన్ని కమిటీ పరిశీలిస్తుంది. అభ్యర్థులకు గమనికగా.. అభ్యర్థిత్వాన్ని ఆశించేవారు ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని తెలిపింది. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో, ప్రజా సేవ చేయాలనే తపన ఉన్న వారి బయోడేటాలు మాత్రమే కమిటీ పరిశీలన చేస్తుందన్నట్లు వెల్లడించింది.