Jayasudha
Jayasudha – BJP: మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ ఇవాళ కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ(Delhi)లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో జయసుధ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి కలిసి జయసుధకు పార్టీ సభ్యత్వ రసీదును అందజేశారు. జయసుధకు కాషాయ కండువా కప్పి తరుణ్ చుగ్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కూడా ఆమె సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా జయసుధ కలిశారు. అన్ని వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని అమిత్ షా ఈ సందర్భంగా అన్నారు.
క్రైస్తవుల కోసం పనిచేస్తా
తాను బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం ప్రధాని మోదీ అని జయసుధ చెప్పారు. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. తాను బీజేపీలో చేరడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. తాను అమిత్ షాను కలిశానని అన్నారు. క్రైస్తవుల కోసం పనిచేస్తానని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. మంచి మార్పు కోసం పార్టీలో చేరుతున్నానని తెలిపారు.
9 నంది అవార్డులు అందుకున్నారు: కిషన్ రెడ్డి
జయసుధ సినిమాల్లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఆమె జీవిత సాఫల్య అవార్డు, తొమ్మిది నంది అవార్డులు, ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజలకు సేవలందించారని అన్నారు. పేదలు, బస్తీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. జయసుధ చేరిక పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన పోవాలనుకుంటున్నారని చెప్పారు.
Hardik Pandya: మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు: హార్దిక్ పాండ్యా