గుంటూరు టికెట్ డిమాండ్ : జగన్ తో ఎన్టీఆర్ మామ నార్నే మళ్లీ భేటీ

  • Publish Date - February 28, 2019 / 06:40 AM IST

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ మరోసారి జగన్ తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి పోటీకి సై అంటున్నారు నార్నే. గుంటూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన.. ఆప్షన్ కూడా ఇచ్చారంట. ఎంపీ కాకపోతే.. అసెంబ్లీకి అయినా పోటీ చేయటానికి సిద్ధం అని జగన్ ఎదుట ప్రపోజల్ పెట్టారంట. ఫిబ్రవరి 28వ తేదీ గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ – నార్నే భేటీలో కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.

గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వలేకపోతే.. సాధ్యం కాకపోతే అదే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పొన్నూరు, పెదకూరపాడు, గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం ఇవ్వాలని కోరుతున్నారు నార్నే శ్రీనివాస్. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పేరున్న వ్యక్తిగా నార్నేకు గుర్తింపు.

అంతకంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లను ఇచ్చిన వ్యక్తి. ఇంత పలుకుబడి ఉన్న వ్యక్తి పోటీకి సిద్ధం అంటుంటే.. జగన్ కాదనగలరా అనే టాక్ కూడా నడుస్తోంది. వారం రోజుల్లో రెండోసారి భేటీ అంటే.. ఏదో ఒక టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. టికెట్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే రెండోసారి జగన్ భేటీ కారని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.