ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ సందర్భంగా మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన తెచ్చిన కొడాలి నాని.. ఆసక్తికర
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన తెచ్చిన కొడాలి నాని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మరణమే వస్తే.. లేకపోతే దేవుడే ప్రత్యక్షమై అడిగితే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి మరణం కావాలని అడుగుతానని మంత్రి కొడాలి నాని భావోద్వేగంగా చెప్పారు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారని చెప్పారు. అలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుందన్నారు. వైఎస్ చేసిన మంచి పనులే జగన్ ను గెలిపించాయని చెప్పారు.
పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ ను తిట్టిస్తున్నారు:
మూడు రాజధానుల నిర్ణయంతో సీఎం జగన్‌ను, ఆయన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేశారని మంత్రి కొడాలి ఆరోపించారు. సోషల్ మీడియాలో, టీడీపీ అనుకూల చానెల్స్‌లో మహిళలను, కొందరు తాగుబోతుల్ని పోగుచేసి వైఎస్ ను, సీఎం జగన్, వారి కుటుంబ సభ్యలలను తిట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే వైఎస్ మరణం గురించి కూడా మాట్టాడుతున్నారని చెప్పారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. ఈ రెండు నగరాలు.. రాజధానులు లేకపోయినా సామాజికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాయని కొడాలి నాని అన్నారు.
మూడు రాజధానులు అందుకే:
రాష్ట్రం మొత్తం అభివృధ్ది జరగాలనే సదుద్దేశ్యంతోనే సీఎం జగన్ 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని కొడాలి నాని చెప్పారు. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే కొందరి వాదనను ఆయన కొట్టిపారేశారు. కమ్మ సామాజిక వర్గాన్నిజగన్ దెబ్బ తీయాలి అనుకుని ఉంటే కడపనే రాజధానిగా చేసి ఉండేవారని నాని వివరించారు. రాజధాని విషయంలో సామాజిక అంశాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని.. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖకు తరలి వెళ్లినా అక్కడా కమ్మ కులస్తులదే ఆధిక్యం అని కొడాలినాని చెప్పుకొచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నంలో కమ్మసామాజిక వర్గానికి చెందిన వారే ఎంపీలుగా గెలుస్తున్నారని కొడాలి వివరించారు.
మన కమ్మోళ్లకి రెండు రాజధానులు:
కమ్మ వర్గాన్ని దెబ్బ తీయడానికే జగన్ రాజధానిని మారుస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. అమరావతితో పాటు ఇప్పుడు విశాఖ కూడా రాజధానియే అన్నారు కొడాలి. వైజాగ్‌లో ఉన్న ఆస్తులు మావా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. విశాఖలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్, సినిమా థియేటర్లు, షోరూమ్‌లో అన్ని కమ్మకులానికి చెందినవారివేనని చురకలంటించారు. నారా లోకేష్ తోడల్లుడుకు విశాఖలో ఏకంగా పెద్ద విద్యాసంస్థే ఉందన్నారు. ఏదో కమ్మవారిని టార్గెట్ చేసి జగన్ రాజధానిని తరలించేస్తున్నారని చంద్రబాబు, ఆయన పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కమ్మ వర్గం వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇకపై వారికి రెండు రాజధానులు ఉంటాయంటూ సెటైర్లు వేశారు కొడాలి. కులం మీద ద్వేషంతో జగన్ రాజధాని తరలిస్తున్నారనడం సరికాదన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు మంచోళ్లు.. నన్ను గెలిపిస్తారు:
గుంటూరు, కృష్ణా జిల్లాలు ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతూ వస్తున్నాయన్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో చంద్రబాబు అక్కడ కొత్తగా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారన్నారు. నాలాంటి వాళ్లు కూడా వెళ్లి అక్కడ పోటీ చేసినా గెలిపిస్తారన్నారు కొడాలి. ఇప్పుడు చంద్రబాబు సానుభూతి కోసం జోలిపట్టినా ఎవ్వరూ పట్టించుకోరన్నారు. పాపాల భైరవుడు జోలి పట్టి డబ్బులు అడిగితే ఎవరూ ఆయనపై జాలిపడరు.. సరికదా.. చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తారు అని కొడాలి నాని అన్నారు.